జో బైడెన్ పై ప్రతీకారానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం!
మూడేళ్ల కిందట అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తల్లకిందులు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ విచారణ ప్రారంభం కానుంది. దీనికి ప్రతిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆయన కుమారుడి లావాదేవీల అంశంలో అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన కంపెనీ బురిస్మాలో లోగడ డైరెక్టరుగా ఉన్నారు. బురిస్మా సంస్థ నుంచి జో, హంటర్ బైడెన్లకు ముడుపులు ముట్టాయని ప్రతిపక్ష రిపబ్లికన్లు రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభలో ప్రతిపక్ష రిపబ్లికన్లకు మెజారిటీ ఉండటాన్ని అవకాశంగా తీసుకుని బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమోక్రాట్లు రెండుసార్లు ఆయనపై అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. అప్పట్లో దిగువ సభలో వారిదే మెజారిటీ. అమెరికా చరిత్రలో ట్రంప్‌లా రెండుసార్లు అభిశంసన తీర్మానానికి గురైన అధ్యక్షుడు మరొకరు లేరు. బైడెన్‌పై అవినీతి బురదచల్లకపోతే ఆయుధ సహాయం నిలిపేస్తానంటూ 2019లో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఫోన్లో బెదిరించినందుకు మొదటిసారి అభిశంసనకు గురయ్యారు. 2021 జవనరి 6న అమెరికా పార్లమెంటుపై దాడికి తన మద్దతుదారులను పరోక్షంగా ప్రోత్సహించారని రెండోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు.






