2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ!
అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్రపడిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఎన్నికల్లో ఓటమితో జనవరి 20న పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఫ్లోరిడాలోని ఆక్లాండ్‌లో నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వార్షిక సమావేశంలో తొలిసారి బహిరంగ వేదికపై మాట్లాడారు. అమెరికాను తాను నంబర్ వన్‌గా నిలిపితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నెలరోజుల పాలనలోనే చివరి నంబర్‌కు పడిపోయేలా చేశాడని విమర్శించారు.
హౌస్‌ను (అమెరికా కాంగ్రెస్) మనం మళ్లీ మన ఆధీనంలోకి తీసుకోవాలి. సెనేట్ను గెలువాలి. అప్పుడే రిపబ్లికన్ ప్రెసిడెంట్ మళ్లీ వైట్‌హౌస్ (అధ్యక్ష భవనం)లోకి అడుగు ప్టెగలడు. అలా చేయగల శక్తిమంతులు ఇంకెవరైనా ఉన్నారా? అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని, 2022 లో జరిగే మిడ్ టెర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లను ఓడించేందుకు రిపబ్లికన్లంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.






