మాట మార్చిన బైడెన్ టీం.. వైట్‌హౌస్ ఉద్యోగులకు షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్ ఉద్యోగులకు షాకిచ్చారు. అధ్యక్షుడి అధికార నివాసంలో పనిచేసే ఉద్యోగుల గంజాయి వాడకంపై కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. వైట్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగులు ఇలాంటి మత్తుపదార్థాలు తీసుకోవద్దని, గతంలో ఇలాంటివి తీసుకొని ఉంటే సీరియస్‌గా తీసుకోబోమని, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని అనధికారికంగా చెప్పారట. బైడెన్ పాలకవర్గంలో కీలక పదవుల విషయంలో కూడా గంజాయి వాడకంపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. అయితే వైట్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగులకు ఉన్నతాధికారులు తాజాగా పెద్ద షాక్ ఇచ్చారు. వైట్‌హౌస్‌లో పనిచేసే వారందరికీ ఇటీవల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన అధికారులు.. ఆ సమయంలో గతంలో ఎప్పుడైనా గంజాయి తీసుకున్నారా? అని అడిగారట.
యువ ఉద్యోగులు, ముఖ్యంగా గంజాయి వాడకం చట్టబద్ధమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తీసుకున్నట్లు చెప్పడంతో వారికి ఫోన్లు చేసి ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు చెప్తున్నారట. కొంత మందిని ముఖ్యమైన పదవుల నుంచి తొలగించి చిన్న ఉద్యోగాలకు బదిలీలు చేస్తున్నారట. లేదంటే రాజీనామా చేయాలని కోరుతున్నారట. గతంలో గంజాయి వాడకాన్ని సీరియస్‌గా తీసుకోవడం జరగదని తమతో చెప్పారని, అయితే ఇలా సడెన్‌గా నిర్ణయం తీసుకోవడం ఏమీ బాగలేదని వైట్‌హౌస్ ఉద్యోగులు అంటున్నారు. తమకు ఈ పాలసీ గురించి ఎటువంటి వివరణా ఇవ్వలేదని, గంజాయి వాడకం చట్టబద్దంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని విమర్శిస్తున్నారు. వైట్‌హౌస్ నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అన్నె ఫిలిపిక్ నేతృత్వంలో ఉద్యోగులకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ గంజాయి పాలసీ వివాదాస్పదం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో గంజాయి వాడకంపై ఫెడరల్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. అలస్కా, ఆరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, ఇల్లినాయిస్, మైన్, మసాచుసెట్స్, మిచిగాన్, మోంటానా, నెవాడా, న్యూజెర్సీ, ఓరెగాన్, వెర్మాంట్, వాషింగ్టన్ రాష్ట్రాలు, అలాగే వాషింగ్టన్ డిసిలో ఇది చట్టబద్ధమే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం తను రచించిన తొలి పుస్తకం ‘‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’’లో తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు గంజాయి వాడేవాడినని, కొద్దిగా బ్లో కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. బ్లో అంటే కొకైన్. ఆయన కుమారుడు కూడా కొకైన్ వాడినట్లు తేలడంతో యూఎస్ నేవీ రిజర్వు నుంచి విడుదల చేశారు.






