CSK: శివం దుబే.. దీన్ని క్రికెట్ అంటారా..?
హైదరాబాద్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్(SRH) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అభిమానులను, విశ్లేషకులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది మాత్రం ఆల్‌రౌండర్ శివం దుబే(Shivam Dube) ప్రదర్శన. వరల్డ్ కప్ హీరో అని పిలుచుకునే దుబే, నిన్నటి మ్యాచ్‌లో ఆడిన తీరు చూస్తుంటే అతను అసలు ఒక ప్రొఫెషనల్ క్రికెటరా కాదా అనే అనుమానం కలగక మానదు. ఒకవైపు భారీ లక్ష్యం కళ్ల ముందు ఉంది.
జట్టుకు ఒక పటిష్టమైన ఇన్నింగ్స్ కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన దుబే, అసలు సెటిల్ అవ్వడానికి ప్రయత్నించలేదు. 16 బంతుల్లో కేవలం 21 పరుగులు చేసి, సాకిబ్ హుస్సేన్ వేసిన స్లోయర్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్పిన్నర్లను చీల్చి చెండాడుతాడని పేరున్న దుబే, నిన్న మాత్రం బంతిని కనీసం సరిగ్గా టైమింగ్ కూడా చేయలేకపోయాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ ఎదుర్కోవడంలో అతని పాత బలహీనతలు మళ్ళీ బయటపడ్డాయి.
బ్యాటింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్‌లో ఏమైనా ఆదుకుంటాడా అంటే అక్కడ కూడా నిరాశే మిగిలింది. మ్యాచ్ ప్రారంభంలోనే అత్యంత ప్రమాదకరమైన అభిషేక్ శర్మ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను దుబే జారవిడిచాడు. ఆ ఒక్క డ్రాప్ వల్ల అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే 59 పరుగులు చేసి హైదరాబాద్ కు భారీ స్కోరును అందించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందే చెప్పినట్టు చెన్నై ఫీల్డింగ్ 50-50 గా ఉంది, అందులో దుబే చేసిన తప్పులు జట్టు విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి.








