IPL 2026: బంగ్లాదేశ్‌కు ఐపీఎల్ షాక్.. బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న జియోస్టార్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ఆరంభ వేళ బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ అభిమానులకు, అక్కడి క్రీడా ప్రసార సంస్థలకు భారత టెలికాం, మీడియా దిగ్గజం ‘జియోస్టార్’ (JioStar) భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని జియోస్టార్ ఏకపక్షంగా రద్దు చేసుకుంది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని బంగ్లాదేశ్ అధికారిక స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ అయిన ‘టీస్పోర్ట్స్’ (T-Sports) కు రాసిన లేఖలో జియోస్టార్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖ కథనాలను వెల్లడించాయి.
ఆర్థిక లావాదేవీల వైఫల్యమే కారణమా?
జియోస్టార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక ప్రధానంగా ఆర్థిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ ‘టీస్పోర్ట్స్’ నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయడంలో పదేపదే విఫలమవడమే ఈ రద్దుకు దారితీసిందని సమాచారం. ఐపీఎల్‌తో (IPL 2026) పాటుగా, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రసారాలకు కూడా ఈ రద్దు వర్తిస్తుందని జియోస్టార్ తేల్చిచెప్పింది. ఈ నిర్ణయంతో 2027 వరకు ఐపీఎల్ ప్రసారాల కోసం టీస్పోర్ట్స్‌కు ఉన్న చట్టపరమైన అనుమతులు పూర్తిగా రద్దయినట్లయింది.
ఇవి కూడా చదవండి
ముస్తాఫిజుర్ వివాదం.. నిషేధం నేపథ్యం
జియోస్టార్ తాజా నిర్ణయానికి గతంలో చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు (Geo-political issues) కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఉన్న సమయంలో, అక్కడ హిందూ మైనార్టీలపై వరుసగా దారుణ దాడులు జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఐపీఎల్ (IPL 2026) మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేయడం భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజాగ్రహం నేపథ్యంలో బీసీసీఐ (BCCI) జోక్యం చేసుకుని కేకేఆర్ అతడిని వదులుకునేలా ఆదేశించింది. దీనికి ప్రతీకారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై అధికారికంగా నిషేధం విధించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉపసంహరణ యోచన.. అంతలోనే రద్దు!
అయితే బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం క్రికెట్ అభిమానుల ఒత్తిడి మేరకు ఐపీఎల్ (IPL 2026) ప్రసారాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల సంకేతాలు ఇచ్చింది. కానీ వారు ఆ నిర్ణయం తీసుకోకముందే, ఆర్థిక లావాదేవీల లోపాలను ఎత్తిచూపుతూ జియోస్టార్ ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, పాపులర్ క్రికెట్ లీగ్‌గా పేరుపొందిన ఐపీఎల్‌కు బంగ్లాదేశ్‌లో విశేషమైన ఆదరణ ఉంది. తాజా పరిణామాలతో అక్కడి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ నిర్ణయం ఐపీఎల్ గ్లోబల్ వ్యూయర్షిప్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్పై కొంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








