చీమల స్మగ్లింగ్‌తో కోట్లు… ‘పెంపుడు చీమల’ బిజినెస్ ఇంత పెద్దదా?
మనిషి అభివృద్ధి ఎంత దూరం వెళ్లిందంటే…
ఒకప్పుడు ఇంట్లో చీమ కనిపిస్తే చక్కెర డబ్బా మూసేవాడు. తర్వాత చీమలు ఎక్కువైతే మందు కొట్టేవాడు. ఇప్పుడు కాలం మారింది.
అదే చీమ కోసం విమానం ఎక్కుతున్నాడు. అది దొరకకపోతే వెతుక్కుంటున్నాడు. దొరికితే కొనుక్కుంటున్నాడు. కొన్న తర్వాత ప్రేమగా చిన్న ప్లాస్టిక్ ట్యూబ్‌లో పెట్టి… సూట్‌కేసులో దాచుకుని దేశాలు దాటిస్తున్నాడు.
మానవ నాగరికత చక్రాన్ని కనిపెట్టింది. విమానాలను తయారు చేసింది. ఇంటర్నెట్ను సృష్టించింది. చివరికి ఆ అద్భుతమైన ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే…
చీమలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడే స్థాయికి.
నైరోబీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఒక వ్యక్తి బ్యాగ్ తెరిచినప్పుడు బహుశా బంగారం ఉంటుందని అనుకుని ఉంటారు.
లేదా డ్రగ్స్. లేదా ఇంకేదైనా ఖరీదైన వస్తువు. కానీ బ్యాగ్‌లో ఉన్నది మాత్రం… 2,200 చీమలు! అవును. రెండు, పది కాదు. ఏకంగా రెండు వేల రెండు వందల చీమలు. చిన్న చిన్న ప్లాస్టిక్ ట్యూబుల్లో వాటిని జాగ్రత్తగా పెట్టారు. ప్రయాణంలో బతికి ఉండేందుకు తడి పత్తి కూడా ఏర్పాటు చేశారు.
చీమలకు పాస్‌పోర్ట్ లేదు. వీసా లేదు. టికెట్ కూడా లేదు. కానీ వాటికి మాత్రం విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. “అసలు చీమలకీ ఇంత డిమాండ్ ఉందా బాబూ?” అని ఆశ్చర్యపోతున్నారా… సమాధానం వింటే ఇంకోసారి ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే ఈ కథలో చీమలు కేవలం చీమలు కావు. కొన్నింటికి బ్లాక్ మార్కెట్లో వందల డాలర్ల ధర ఉంది. మరికొన్ని చీమల కోసం ప్రపంచం నలుమూలల నుంచి కలెక్టర్లు వెతుకుతున్నారు. అంటే మనం ఇంట్లో కనిపిస్తే ఊడ్చేసే చీమ… మరొక దేశంలో ఎవరికో ‘లగ్జరీ పెట్’!. ఇక్కడే మొదలవుతోంది ఈ విచిత్రమైన పెంపుడు చీమల ప్రపంచం కథ.చీమకు ఇదంతా తెలిస్తే అది కూడా కాసేపు ఆగి ఆశ్చర్యపోయేదేమో.
అసలు చీమలకు ఇంత డిమాండ్ ఎందుకు?
ప్రపంచంలో కొందరికి కుక్కలు, పిల్లులు, చేపలు పెంచుకోవడం ఎలా సాధారణ విషయమో…చీమలను పెంచటం కూడా అంతే సాధారణ విషయం. ఏదో ముద్దుకు ఒకటి రెండు చీమలు కావు, వందల్లో, వేలల్లో…పెంచుతున్నారు.
ప్రత్యేకంగా తయారు చేసిన పారదర్శక పెట్టెల్లో చీమలను పెంచుతారు. వాటిని చూస్తే చిన్నపాటి అండర్‌గ్రౌండ్ సిటీలా ఉంటుంది. చీమలు సొరంగాలు తవ్వుతాయి, ఆహారం కోసం బయటకు వెళ్తాయి, తిరిగి వస్తాయి, తమ సామ్రాజ్యాన్ని నెమ్మదిగా విస్తరించుకుంటాయి.
వాళ్లకు అదే నెట్ ప్లిక్స్
బయిటనుంచి చూస్తే “ఇందులో చూడటానికి ఏముంది?” అనిపించవచ్చు. కానీ చీమల అభిమానులకు మాత్రం ఇదే నెట్‌ఫ్లిక్స్. ఒక రాణి చీమ నుంచి కొత్త కాలనీ పుట్టడం, వేలాది చీమలు పని పంచుకోవడం, కొత్త గూళ్లు నిర్మించడం… వీళ్లకు ఇదంతా ఒక లైవ్ సీరియల్లాంటిదే.
కానీ అసలు స్టార్ మాత్రం రాణి చీమే!
ఈ కథలో 2,200 చీమలు ఉన్నాయని విని అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ స్మగ్లర్లకు అసలు ఆసక్తి సంఖ్య మీద కాదు. వాళ్లకు కావాల్సింది రాణి చీమలు. ఎందుకంటే చీమల ప్రపంచంలో రాణి చీమ అంటే… కాలనీకి సీఈఓ, ఫ్యాక్టరీ ఓనర్, భవిష్యత్తు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసిన ఒకే జీవి అన్నమాట.
ఒక రాణి చీమ దొరికితే కొత్త కాలనీని మొదలుపెట్టవచ్చు. అందుకే కెన్యాలో కొన్ని డాలర్లకే దొరికే ఒక ఆఫ్రికన్ హార్వెస్టర్ రాణి చీమ విదేశీ బ్లాక్ మార్కెట్లో 200 డాలర్లకుపైగా ధర పలుకుతోంది.
అంటే… మన ఇంట్లో చీమలు ఉచితంగా తిరుగుతుంటాయి. కానీ సరైన జాతి చీమ అయితే విమానం ఎక్కేలోపు దాని విలువ మన నెల జీతంతో పోటీ పడుతుంది. జీవితంలో విలువ అనేది ప్రతిభను బట్టి వస్తుందా, అరుదుదనాన్ని బట్టి వస్తుందా అన్న చర్చను ఈ చీమలు కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.
చీమలను పెంచడం కూడా ఇప్పుడు ఒక ఫ్యాషనే!
కరోనా సమయంలో ప్రపంచం ఇంట్లో కూర్చుని బోర్ కొట్టుకుంది. ఎవరో వంటలు నేర్చుకున్నారు. ఎవరో మొక్కలు పెంచుకున్నారు.మరెవరో యోగా చేశారు.వీళ్లందరికీ భిన్నంగా కొందరు మాత్రం…
“ఒక చీమల కాలనీ పెంచితే ఎలా ఉంటుంది?” అని ఆలోచించారు. అలా మొదలైన హాబీ సోషల్ మీడియా చేతికి చిక్కాక ఇంకాస్త పెద్దదైంది. ఇప్పుడు చీమల కోసం ప్రత్యేక కమ్యూనిటీలు ఉన్నాయి. అరుదైన జాతుల కోసం వెతికే కలెక్టర్లు ఉన్నారు. ఒక కాలనీ జీవితాన్ని గంటల తరబడి చూసే అభిమానులు ఉన్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
కానీ మనిషి ఒక హాబీని బాగా ఇష్టపడటం ప్రారంభించినప్పుడు జరిగే తదుపరి విషయం మీకు తెలుసు కదా?. దానికి మార్కెట్ ఏర్పడుతుంది. మార్కెట్ ఏర్పడితే ధర పెరుగుతుంది. ధర పెరిగితే… స్మగ్లర్ ఎక్కడి నుంచో ప్రత్యక్షమవుతాడు. స్మగ్లర్లకు కూడా ఇప్పుడు చీమలే దొరికాయా?అదే కదా విచిత్రం!
వన్యప్రాణుల అక్రమ రవాణా అంటే మనకు వెంటనే ఏనుగు దంతాలు, పులి చర్మాలు, అరుదైన పక్షులు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి… చీమలు కూడా వచ్చేశాయి.
నైరోబీ ఘటనలో చీమలను చిన్న ప్లాస్టిక్ ట్యూబుల్లో పెట్టి తరలించేందుకు సిద్ధం చేశారు. ట్యూబ్లలో తడి పత్తి కూడా పెట్టారు. ప్రయాణంలో అవి బతికి ఉండాలన్నది స్మగ్లర్ల ప్లాన్. అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా చీమలు బ్యాగ్‌లోకి ఎక్కిన వ్యవహారం కాదు. పూర్తి ట్రావెల్ అరేంజ్మెంట్.
సర్లే ఈ చీమలు ఎలా పోతే మనకేంటి అంటారా..?
ఇక్కడే ఈ సరదా కథ కాస్త సీరియస్ అవుతుంది. ఎందుకంటే మనకు చీమ అంటే చిన్న జీవి కావచ్చు. కానీ ప్రకృతికి అది చిన్నది కాదు. ముఖ్యంగా గడ్డి మైదానాల్లో ఈ చీమలు చాలా కీలకమైన పని చేస్తాయి. ఆహారం కోసం తిరుగుతూ విత్తనాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తాయి. భూమిలో సొరంగాలు తవ్వడం ద్వారా నేలలోకి గాలి చేరడానికి సహాయపడతాయి. మొక్కలు పెరగడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.
అంతేకాదు, అనేక జంతువులకు చీమలే ఆహారం. అంటే మనం సూట్‌కేస్‌లో పెట్టుకుని విదేశాలకు పంపిస్తున్నది కేవలం కొన్ని వేల చిన్న జీవులు కాదు. ప్రకృతిలో ఒక పెద్ద వ్యవస్థను నడిపించే చిన్న చిన్న కార్మికులు. రాణి చీమను తీసుకెళ్తే… అసలు నష్టం అప్పుడే మొదలవుతుంది
సాధారణ చీమలను కాకుండా రాణి చీమలను స్మగ్లర్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకోవడానికి కారణం డబ్బు. కానీ అదే ప్రకృతికి పెద్ద సమస్య. ఒక రాణి చీమ దశాబ్దాల పాటు జీవించి, వేలాది చీమలతో ఒక కాలనీని నిర్మించగలదు. అంటే ఒక రాణి చీమను పట్టుకెళ్లడం అంటే… ఒక చిన్న జీవిని దొంగిలించడం కాదు. భవిష్యత్తులో పుట్టాల్సిన ఒక చిన్న నగరాన్నే ముందుగానే ఖాళీ చేయడం.
మనుషులం ఇళ్ల కోసం అడవులు నరికేస్తున్నాం.
ఇప్పుడు హాబీల కోసం అడవిలోని చీమల్ని కూడా తీసుకెళ్తున్నాం. ప్రకృతికి మనతో నిజంగా చాలా ఓపిక ఉండాలి. ఇది పట్టుబడిన ఒక కేసు మాత్రమే నైరోబీలో 2,200 చీమలతో పట్టుబడిన ఘటన ఒక్కటే కాదు. గతంలో దాదాపు 5,000 చీమలను తరలిస్తున్న ఇద్దరు యువకులు కూడా పట్టుబడ్డారు. ఇంకా ఎంతమంది పట్టుబడకుండా వెళ్లిపోయారో మరి.
ఎందుకంటే ఒకసారి ఈ వ్యాపారంలో డబ్బు ఉందని తెలిసిపోయాక, స్మగ్లర్లు కూడా చీమల్లాగే ఉంటారు. ఒక దారి మూసేస్తే… మరో దారి వెతుక్కుంటారు.
ఏదైమైనా …
చీమలు ఇంట్లో కనిపిస్తే పెస్ట్ కంట్రోల్‌కు ఫోన్ చేస్తాం.
అడవిలో కనిపిస్తే సూట్‌కేసులో పెడతాం.
విదేశాల్లో ఉంటే వాటిని పెంపుడు జంతువులంటాం.
ధర పెరిగితే వాటిని అరుదైన వన్యప్రాణులంటాం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








