తెరవెనుక ‘కొండా’ మార్క్ రాజకీయం!
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘కొండా వర్సెస్ రేవంత్’ ఎపిసోడ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించిన రీతిలోనే మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీకి లిఖితపూర్వక వివరణ కూడా సమర్పించారు. అయితే, సురేఖ ఇచ్చిన ఈ వివరణ కాంగ్రెస్ పెద్దలను సంతృప్తి పరిచిందా? లేక కొండా ఫ్యామిలీ వ్యూహాత్మకంగా వేసిన పొలిటికల్ పావుల్లో ఇదొక భాగమా అన్న చర్చ గాంధీ భవన్ వేదికగా జోరుగా సాగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. నేరుగా ముఖ్యమంత్రి వైఖరిపైనే బహిరంగంగా విమర్శలు గుప్పించడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. అయితే, ఈ ఆరోపణలు వెలుగుచూసిన సమయంలో మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ వెంటనే వాటిని ఖండించకపోవడం అనేక రాజకీయ అనుమానాలకు తావిచ్చింది. తన కుటుంబంలో ఒక వ్యక్తి పార్టీ అధినాయకత్వంపై, ముఖ్యమంత్రిపై ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే, మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి మౌనం వహించడమేంటనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కొండా ఫ్యామిలీ ఇదంతా పక్కా ప్రణాళికతోనే నడిపిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. సుస్మితకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాథమిక సభ్యత్వం లేదు. దీనివల్ల ఆమెపై నేరుగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే వెసులుబాటు పార్టీ నాయకత్వానికి లేదు. సభ్యత్వం లేని వ్యక్తి పార్టీ అంతర్గత విషయాలను ప్రశ్నించినా పార్టీ నిబంధనల ప్రకారం వేటు వేయడం సాధ్యం కాదు. ఈ లొసుగును అస్త్రంగా మలుచుకుని, తమ మనసులోని అసంతృప్తిని, అసహనాన్ని కుమార్తె ద్వారా సీఎంకు చేరవేసే వ్యూహాన్ని కొండా దంపతులు అమలు చేశారనే భావన కాంగ్రెస్ హైకమాండ్‌లో బలంగా ఏర్పడింది. అంటే, “అస్త్రం సుస్మితది.. లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి.. అసలు కథ నడిపించింది కొండా ఫ్యామిలీ” అనే అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన వివరణలో “ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకు వాటితో సంబంధం లేదు” అని సురేఖ పేర్కొన్నప్పటికీ, ఆ వివరణ వెనుక రాజకీయ రక్షణ వ్యూహం తప్ప నిజాయితీ లేదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉంటూ, తన ఇంట్లోనే జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తనకు సంబంధం లేదనడం హాస్యాస్పదంగా మారిందనే వ్యాఖ్యలు అంతర్గత సమావేశాల్లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖపై పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సుస్మితపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో, ఆ నెపాన్ని సురేఖ ఖాతాలోనే వేయాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. పార్టీ లైన్ దాటి ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి ఇమేజ్ను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి సీనియర్లయినా ఉపేక్షించేది లేదనే బలమైన సంకేతాన్ని క్యాడర్‌కు పంపాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కొండా సురేఖ మంత్రి పదవికే ఎసరు వస్తుందా లేక పార్టీ పరంగా ఆమెపై క్రమశిక్షణా చర్యలు తప్పవా అన్న అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొండా ఫ్యామిలీ ఆడిన ఈ పొలిటికల్ డ్రామా చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటుందో వేచి చూడాలి.








