వరలక్ష్మీ వ్రతం ఎలా మొదలైందో తెలుసా.. చారుమతికి అమ్మవారి వరం!
శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వివాహిత మహిళలు కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఇంటిని శుభ్రం చేసి, పూజా మండపాన్ని అలంకరించి, కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఈ పూజలో ప్రధాన భాగం. అయితే ఈ వ్రతం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.
చారుమతికి వరలక్ష్మీదేవి అనుగ్రహం

పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణం ఉండేదని పురాణాల్లో ప్రస్తావన ఉంది. అక్కడ చారుమతి అనే భక్తురాలు తన భర్త, అత్తమామలను ఎంతో గౌరవంగా చూసుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేది. ఆమె భక్తికి సంతోషించిన మహాలక్ష్మీదేవి ఒక రోజు చారుమతి కలలో ప్రత్యక్షమై తనను వరలక్ష్మీ రూపంలో పూజించాలని సూచించినట్లు కథ చెబుతుంది. శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని అమ్మవారు చెప్పినట్లు పురాణ గాథలో ఉంటుంది.
చారుమతి ఆచరించిన వరలక్ష్మీ వ్రతం

కలలో అమ్మవారి ఆదేశాన్ని పొందిన చారుమతి మరుసటి రోజు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆమె మాటలను నమ్మిన చుట్టుపక్కల మహిళలు కూడా కలిసి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించిన శుక్రవారం అందరూ తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని, స్నానాలు చేసి పూజకు సిద్ధమయ్యారు. పసుపుతో గణపతిని ఏర్పాటు చేసి, కలశంలో పవిత్ర జలాలు, మామిడి ఆకులు, కొబ్బరికాయ వంటి వాటిని ఉంచి లక్ష్మీదేవిని ఆవాహన చేశారు.
పూజ సమయంలో మహిళలు అమ్మవారికి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి భక్తితో ప్రార్థించారు. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి , ఇతర మహిళలు లక్ష్మీదేవికి ప్రదక్షిణలు చేసినప్పుడు వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని కథ చెబుతుంది. వారి ఇళ్లలో సంపద, సౌభాగ్యం పెరిగి, కుటుంబ సభ్యులకు సంతోషం కలిగిందని పురాణ గాథలో పేర్కొంటారు. అందుకే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మీగా పిలుస్తారని విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం ఇచ్చే శుభఫలాలు

వరలక్ష్మీ వ్రతంలో కేవలం ధనం మాత్రమే కాకుండా ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం వంటి అనేక శుభఫలాలను కోరుకుంటారు. లక్ష్మీదేవి ఎనిమిది రూపాలైన అష్టలక్ష్ములను స్మరించడం కూడా ఈ పూజలో ప్రత్యేకతగా భావిస్తారు. వ్రతం సందర్భంగా చేతికి పసుపు దారాన్ని కట్టుకోవడం, అమ్మవారికి అలంకరణ చేయడం, ముత్తైదువులకు వాయనం ఇవ్వడం వంటి సంప్రదాయాలు ప్రాంతానుసారం కనిపిస్తాయి.
ఈ వ్రతం వెనుక ఉన్న ప్రధాన సందేశం భక్తి, కుటుంబ ఐక్యత, సత్ప్రవర్తన, దైవ విశ్వాసానికి సంబంధించినది. చారుమతి కథ ద్వారా నిజాయితీగా జీవిస్తూ, కుటుంబ సభ్యులను గౌరవిస్తూ, విశ్వాసంతో చేసే ప్రార్థనకు ప్రత్యేకమైన విలువ ఉందనే భావనను తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని భక్తితో పూజించడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా మారింది.








