అడవుల రక్షణకు కర్ణాటక నమూనాపై పవన్ ఫోకస్..!
ఆంధ్రప్రదేశ్లోని అడవులను, వన్యప్రాణులను మరియు విలువైన అటవీ సంపదను ప్రతి అంగుళం కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. అటవీ పరిరక్షణలో అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న అటవీ ఐటీ నివేదికలు, అక్కడి పరిరక్షణ నమూనాలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు.
అడవుల్లో జరిగే ప్రతి కదలికను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఒక అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ద్వారా అటవీ ప్రాంతాల్లో అక్రమ రవాణా, చెట్ల నరికివేత, వన్యప్రాణుల వేట వంటి అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వతంగా బ్రేక్ వేయనున్నారు. కేవలం సాంకేతికతతో నిఘా పెట్టడమే కాకుండా, అటవీ సంపదను కాపాడటంలో ఎక్కడా రాజీ పడకూడదనే పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.
అటవీ శాఖ సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-గస్తు’ తరహా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా అటవీ అధికారులు, బీట్ సిబ్బంది నిర్వహించే గస్తీ (పెట్రోలింగ్) వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. కర్ణాటక అటవీ ఐటీ విభాగం సాధించిన విజయాలను ఏపీలోనూ వర్తింపజేస్తూ, త్వరలోనే రాష్ట్రంలో ఒక సమగ్ర ఆధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థను తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అటవీ అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.








