కాళేశ్వరం ప్రాజెక్టుపై రంగంలోకి సీబీఐ!?
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై.. ఇపుడు సీబీఐ దృష్టి సారించబోతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడం, నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏడాది కిందటే ఈ ప్రాజెక్టుపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సీబీఐ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు.. ఈ పైలును సీబీఐ టేకప్ చేసినట్లు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, చట్టపరమైన చిక్కులు, న్యాయ నిపుణుల సలహాలపై సీబీఐ అధికారులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
2022 ఆగస్టు 30న అప్పటి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణలో సీబీఐ దర్యాప్తులపై ఆంక్షలు విధించింది. వీటిని సవరిస్తూ సెప్టెంబర్ 1, 2025న నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ఫండ్స్ దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాల ఉల్లంఘనపై ప్రజాసేవకులు, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలపై విచారణ జరిపేందుకు సీబీఐకి చట్టబద్ధమైన అధికారం కల్పిస్తూ ఈ ఆదేశాలు విడుదలయ్యాయి. సీబీఐ విచారణకు ఆటంకాలు తొలగడంతే.. ఇప్పుడు కాళేశ్వరంపై సమగ్ర విచారణకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో సునామీ సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్నొక ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించింది. అయితే అదిప్పుడు అధికార పార్టీకి రాజకీయ అస్త్రంగా మారింది. ప్రాజెక్టు డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు, నిధుల మళ్ళంపు వంటి అంశాలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసిన విచారణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. తాజాగా సీబీఐ రంగప్రవేశం చేయడం ద్వారా ఈ విచారణ పరిధి కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయికి చేరినట్లయింది. సీబీఐ అధికారులు కోర్టు ప్రొసీడింగ్స్, పీసీ ఘోష్ కమిషన్ ఫైండింగ్స్, దాఖలైన పిటిషన్లను నిశితంగా పరిశీలిస్తూ తదుపరి చట్టపరమైన చర్యలపై త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం దిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కలవడం, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలు, అవకతవకలు, చట్టపరమైన సందేహాలను నివృత్తి చేయడం ఈ దర్యాప్తు వేగవంతం అయిందని చెప్పడానికి సంకేతాలు. రాజకీయంగా ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో పలువురు ప్రముఖులకు చట్టపరమైన ఇబ్బందులు తప్పవనే సంకేతాలను ఇస్తోంది. ప్రజాధనం ఎలా వృథా అయింది, ప్రాణహిత-గోదావరి జలాల పేరుతో జరిగిన దోపిడీ ఏ స్థాయిలో ఉందనే అంశాలపై సీబీఐ దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.








