తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లెక్కలు..! ఆ 3 ఎమ్మెల్సీ సీట్లపై కీలక చర్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాతినిధ్యంపై జోరుగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన నాయకుడే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. మాటల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపింక చేసింది కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం నినాదం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదనే వాదనకు ఈ పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై అందరి దృష్టి పడింది. గ్రాడ్యుయేట్ స్థానాల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేలా, ఈ మూడూ ఎమ్మెల్సీ పదవులను పూర్తిగా బీసీ వర్గాలకే కేటాయించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు సింహభాగం దక్కేలా చూసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పార్టీ సంస్థాగత పదవులు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా బీసీ ప్రాతినిధ్య అంశాన్ని హైకమాండ్ ముందు గట్టిగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. బీసీ కుల గణన సభల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేబినెట్, శాసనమండలి, కార్పొరేషన్లలో బీసీలకు తగిన స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు దెబ్బతిన్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు బీసీ వర్గాలను సంతృప్తిపరచడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. దసరా పండుగ లోపు కార్పొరేషన్ చైర్మన్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలలో కనీసం రెండు లేదా వీలైతే మూడింటిని బీసీలకే కేటాయిస్తేనే పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని అణచివేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ తీసుకునే చొరవ, హైకమాండ్ చూపించే సానుకూలత రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అమలుపై స్పష్టతనివ్వనుంది. బీసీ నేతలను తెరపైకి తెచ్చి, పదవుల కేటాయింపులో కూడా అదే స్థాయిలో న్యాయం చేయడంలో టీపీసీసీ చీఫ్ ఎంతవరకు సఫలం అవుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.








