48 గంటల్లో ఎన్ ఆర్ ఐ వివాహాల నమోదు తప్పనిసరి
ఎన్ఆర్ఐ వివాహాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి వివాహాలు జరిగిన 48 గంటల్లోపు సమీప రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. లేదంటే పాస్‌పోర్టు, వీసాలను జారీ చేయరు. త్వరలో కేంద్ర మహిళ శిశుసంక్షేమశాఖ దేశంలోని రిజిస్ట్రార్ కార్యాలయాలన్నిటికీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. మహిళలు, పిల్లలపై పెరిగిపోతున్న నేరాల నియంత్రణపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
లైంగిక దాడికేసుల్లో నిందితులను సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవడానికి వీలుగా దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులకు జులై నెలాఖరుకల్లా ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అత్యాచారాలు, లైంగికదాడి కేసుల్లో నేరనిరూపణకు సేకరించాల్సిన సాక్ష్యాధారాలు, నమూనాల జాబితాతోపాటు, వాటి సేకరణకు అవసరమైన సామగ్రి కూడా ఆ కిట్లలో ఉంటుందన్నారు. ఇక పనిచేసే ప్రాంతాల్లో ఎదురయ్యే లైంగికవేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి 2017లో ఆన్లైన్ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటుచేశామని, ఇప్పటివరకూ 191 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. మహిళలపై పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి వీలుగా వచ్చే మూడునెలల్లో ఆన్లైన్ కేంద్రీకృత రిపోర్టింగ్ వ్వవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. వెబ్సైట్లలో మహిళలు, పిల్లలకు సంబంధించిన అభ్యంతరకరమైన వివరాలు పోస్టు చేసినప్పుడు వాటిని తక్షణం తొలగించే వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు.













