వారి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : బాలినేని
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla Janardhan)పై జనసేన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరాచకాలు శృతిమించాయని, తానే రాజు, తానే మంత్రి(Minister) అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం దందా, ఇసుక అక్రమ విక్రయాలు, మద్యం షాపులు, బార్ల నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక వ్యాపారులు, చివరకు సొంత పార్టీ టీడీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే వైఖరితో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
కూటమిలో పొత్తు ధర్మాన్ని గౌరవించి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని, కానీ తన అనుచరులపై అక్రమంగా కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. తప్పు చేయని తన వర్గీయులను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అక్రమాలు, బాధితుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే వల్ల ఏ సమస్య ఎదురైనా, బాధితులు నేరుగా తన వద్దకు రావచ్చని, తానే స్వయంగా ముందుండి అక్రమాలను అడ్డుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.








