Nara Lokesh: డిప్యూటీ సీఎం పోస్ట్ పై స్పందించిన లోకేష్..
టీడీపీ (TDP) నాయకుల దృష్టిలో నారా లోకేష్ (Nara Lokesh) ఆ పార్టీకి ప్రధాన ఆశాకిరణంగా ఉన్నారు. తమ నాయకుడు ముఖ్యమైన పదవులు అందుకోవాలని వారు కోరుకోవడం సహజమే. ఒక్కప్పుడు తో పోలిస్తే ..ప్రస్తుతం లోకేష్ పార్టీ మీద మంచి పట్టు సాధించారు. చంద్రబాబు (Chandra Babu) తర్వాత టీడీపీలో ఆయన కీలకస్థానం సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 మాసాలకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవి విషయమై కొత్తగా చర్చ మొదలైంది.
ఈ చర్చకు మహాసేన రాజేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్య కారణం కాగా , ఆ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు . మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లాంటి వారు కూడా దీనికి మద్దతు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే అసలు, ఉప ముఖ్యమంత్రి పదవిపై నారా లోకేష్ కి ఏదైనా ఆసక్తి ఉందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇటీవల దావోస్లో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలకమైన శాఖలు అప్పగించారని, వాటి నిర్వహణలోనే తాను పూర్తిగా బిజీగా ఉన్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని, ఉప ముఖ్యమంత్రి పదవి తనకు అవసరమని అనిపించడం లేదని స్పష్టం చేశారు.
లోకేష్ ఈ సమాధానంతో డిప్యూటీ సీఎం పదవి చర్చను ఆపేశారని భావిస్తున్నారు. ఈ విషయంపై ముందుకు వెళ్లడం వల్ల పార్టీలో విభేదాలు రావచ్చన్న ఆలోచన టీడీపీ పెద్దలకు ఉండడంతో, లోకేష్ ఈ చర్చను ముగించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇది వైసీపీకి రాజకీయ లాభాలు తెచ్చిపెడుతుందన్న భావన కూడా ఉన్నందున లోకేష్ ఈ విషయాన్ని సున్నితంగా ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది.
నారా లోకేష్ టీడీపీకి భవిష్యత్తులో నాయకత్వం వహించే కీలక నేతగా పార్టీలో అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లోకేష్ డిప్యూటీ సిఎం ఇష్యూ పై స్పందించ తీరు.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం అతని మరింత హై లైట్ చేస్తోంది. ప్రస్తుతానికి, ఉప ముఖ్యమంత్రి పదవి అంశం ముగిసినట్లుగానే కనిపిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాల్సి ఉంటుంది.






