నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
నైపుణ్య కార్యక్రమాల సమర్థ అమలు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి
నైపుణ్య విభాగం కింద ఇప్పటివరకు 5.43 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ సమర్థ వినియోగానికి ఆదేశం
సీడాప్ ద్వారా ఏడాదికి లక్షమంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
నైపుణ్యాభివృద్ధి విభాగంపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం
అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున చేపడుతున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల సమర్థ అమలు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా యువతకు ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా చేపడుతున్న వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుతీరు, ప్రగతిని అధికారులు వివరించారు. పీఎం కౌశల్ వికాస్ యోజన పథకం వినియోగంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ రెండోస్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 పీఎంకేవీవై సెంటర్స్ అప్ గ్రేడ్ కు సమావేశంలో నిర్ణయించారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన విషయంలో స్వలకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిర్దేశించారు. పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ సమర్థ వినియోగంపైనా మంత్రి సమీక్షించారు. నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
నైపుణ్య విభాగం కింద ఇప్పటివరకు 5.43 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
నైపుణ్యాభివృద్ధి విభాగం కింద ఇప్పటివరకు 5.43 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. ప్లేస్ మెంట్ రేట్ లో నేషనల్ యావరేజ్ 64 శాతం ఉండగా.. స్టేట్ యావరేజ్ 76శాతంతో ప్రధాన రాష్ట్రాల్లో ప్లేస్ మెంట్ ఫెర్ఫార్మెన్స్ లో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. యువతకు పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ అందించిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1.02 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. సీడాప్ ద్వారా 2024 ఏడాదిలో 41,288 మందికి శిక్షణ అందించినట్లు అధికారులు వివరించారు. సీడాప్ ద్వారా ఉద్యోగాల కల్పన విషయంలో 76శాతం ప్లేస్ మెంట్ ఫెర్ఫార్మెన్స్ తో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని, యువతకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ అందించిన ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. సీడాప్ ద్వారా ఏడాదికి లక్ష మంది యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఓంక్యాప్, సీడాప్ అనుసంధానం ద్వారా పెద్దఎత్తున యువతకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పీఎం సేతు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను 18 క్లస్టర్లుగా విభజించి.. విశాఖ క్లస్టర్ కు ఏఎంఎన్ఎస్(ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్) పారిశ్రామిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. మిగతా క్లస్టర్లకు కూడా పారిశ్రామిక భాగస్వాములను త్వరితగతిన ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం ముఖ్య కార్యదర్శి జే.శ్యామలరావు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జీ.గణేష్ కుమార్, ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంఛార్జ్ ఛైర్మన్ ఎస్.విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.








