అయ్యర్ సేనకు ‘డూ ఆర్ డై’.. పరువు కోసం పంత్ సై..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో నేడు లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టుకు అత్యంత కీలకమైన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంజాబ్.. తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ రన్ రేట్ తేడాతో విజయం సాధించడం మినహా మరో మార్గం లేదు.
మరోవైపు, ఇప్పటికే టోర్నమెంట్ నుండి అధికారికంగా ఎలిమినేట్ అయిన రిషభ్ పంత్(Risha Pant) సారథ్యంలోని లక్నో జట్టు.. తమ హోమ్ గ్రౌండ్లో జరగబోయే ఈ చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ జట్టు స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు వీరిద్దరూ తలపడిన 7 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 సార్లు విజయం సాధించగా, లక్నో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. లక్నో జట్టు పంజాబ్‌పై అత్యధికంగా 257 పరుగులు చేయగా, పంజాబ్ జట్టు లక్నోపై అత్యధికంగా 254 పరుగులు నమోదు చేసింది.
ఈ గణాంకాలు ఇరు జట్ల మధ్య నడిచే హోరాహోరీ పోరుకు అద్దం పడుతున్నాయి. ఇదే సీజన్లో ఏప్రిల్ 19న చండీగఢ్‌లో జరిగిన వీరి మునుపటి ముఖాముఖి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రియాంశ్ ఆర్య (93 పరుగులు), కూపర్ కానలీ (87 పరుగులు) ల మెరుపు బ్యాటింగ్‌తో 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. రిషభ్ పంత్ (43), ఐడెన్ మార్క్రమ్ (42) రాణించినప్పటికీ 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లక్నో, ప్లేఆఫ్స్ కోసం ఎలాగైనా గెలవాలని పంజాబ్ పట్టుదలతో ఉండటంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.







