విజయవంతంగా ముగిసిన మహానాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా విజయవాడ నగరంలో మూడు రోజులపాటు జరిగిన మహానాడు విజయవంతంగా ముగిసింది. సాధారణ ఎన్నికలు నిర్ణీత సమయానికే కాదు ముందుగా ఎప్పుడు వచ్చినా అటు బీజీపీ, ఇటు వైకాపా, జనసేన పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొని తెలుగుదేశంకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టే రీతిలో పార్టీ శ్రేణులను సమాయత్త పరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలు ప్రతి ఒక్కరిలో పౌరుషంతో పాటు సమధికోత్సహాన్ని నింపాయి. వచ్చే ఎన్నికల్లో 175 శాసన సభ, 25 ఎంపీ సీట్లతో విజయం సాధించాలనే దిశగా నేతల ప్రశంసగాలు సాగాయి. తొలిసారి సాధారణ కార్యకర్తలకు మహానాడు వేదిక పై నుంచి మాట్లాడే అవకాశం కల్గింది. ప్రధానంగా చంద్రబాబు వ్యూహం ఫలించినట్లయింది.
నాలుగేళ్ల పాటు చట్టపట్టాలేసుకు తిరిగినప్పటికీ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను నిలువరించేందుకు ప్రసంగాలతోనే కాకుండా, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలనే కాకుండా ఐదు కోట్ల మంది ప్రజలలో ఆలోచన రేకెత్తింపచేయగలిగారు. మోదీ, అమిత్‌షాలు విషపూరిత కుట్రలతో, బెదిరింపులతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని సృష్టంగా తమ వాణిని వినిపించగలిగారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి చేయూత లేకపోయినా విపక్షాలు సహకరించకపోయినా అప్పు చేసైనా సరే రాజధాని అమరావతి నగర నిర్మాణం, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామంటూ ప్రతి ఒక్కరిలో మహానాడు ద్వారా ప్రజల విశ్వాసం కల్గింపచేశారు.
అమరావతిలో ప్రభుత్వ వాట కింద మిగిలిన 8 వేల ఎకరాల్లో కొంత భూమి విక్రయించి అప్పు తీరుస్తానంటూ ప్రజల్లో సందేహం లేకుండా చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ మహానాడుకు భారీగా కార్యకర్తలు, మోదీపై పగ, ప్రతీకారం తీర్చుకునే విధంగా తరలివచ్చారంటూ మధ్యమధ్యలో సంతోషపరిచారు. రోజు రోజుకూ మరింత ఉత్సాహభరితంగా సభ ప్రాంగణం కన్పించింది. వేదికపై ఓ వైపు తీర్మానాలపై చర్చలు జరుగుతుండగానే మరో వైపు బాబు పదే పదే నిలబడుతూ అనేక మందిచే సత్కారాలు పొందారు. జ్ఞాపికలు స్వీకరించారు. పసుపు జెండాల రెపరెపలతో భారీ రాజకీయ సంబరంగా ఈ మహానాడు జరిగింది. బాబును తిరిగి అధికారంలో తీసుకువచ్చే వరకు భోజనం చేయబోమన్నంత పట్టుదల అనేక మందిలో కన్పించింది. వేదికపై మాట్లాడిన వారిలో అత్యధిక మంది జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ ప్రస్తావించడం ప్రత్యేకత. లోకేష్ మాత్రం ఈ మూడు రోజులు వేదికపై తన సీట్లో కొద్దిసేపు మాత్రమే కన్పించగా మిగిలిన సమయమంతా వాకీటాకీ చేతబట్టుకుని ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రధానంగా ఏర్పాట్లపైనే దృష్టి సారించారు. వసతి, అల్పాహారం, రవాణా వంటి కార్యాలన్నింటా అందరిలో సంతృప్తి కన్పించింది. బాబుతో పాటు 80 శాతం మంది నేతలు పసుపుచొక్కాలు ధరించడంతో సభా వేదిక పసుపురంగు పులుముకున్నట్లుయింది.











































































