Nara Lokesh: విశాఖలో ‘క్యాప్ జెమినీ’ కొలువు.. గ్లోబల్ సీఈవోతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు
Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘క్యాప్ జెమినీ’ (Capgemini) గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్తో ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సంస్థ కార్యకలాపాల ఏర్పాటు, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
భూముల పరిశీలన పూర్తి:
విశాఖలో కార్యాలయం ఏర్పాటు కోసం క్యాప్ జెమినీ ప్రతినిధులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. మధురవాడ ఐటీ పార్కులోని హిల్-1 వద్ద దాదాపు 20 ఎకరాల స్థలాన్ని సంస్థ అవసరాల కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు అడివివరం, ఆనందపురం ప్రాంతాల్లోని మరికొన్ని స్థలాలను కూడా ప్రతినిధి బృందం సందర్శించింది.
ఇవి కూడా చదవండి

తాత్కాలిక కార్యాలయం సిద్ధం:
సంస్థ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖ సెంట్రల్ పార్క్ సమీపంలోని ఒక ప్రైవేటు భవనాన్ని తాత్కాలిక కార్యాలయంగా ఎంపిక చేశారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు, మౌలిక సదుపాయాల లభ్యత దృష్ట్యా క్యాప్ జెమినీ విశాఖకు రావడం వల్ల ఉత్తరాంధ్రలో ఐటీ రంగం మరింత పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








