పొత్తుపై తేల్చని బీజేపీ..! ఊగిసలాటలో టీడీపీ – జనసేన..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పార్టీలన్నీ శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలు ప్రచారపర్వంలో మునిగిపోయాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికలోనూ తలమునకలయ్యాయి. ప్రాంతీయ పార్టీలు స్పీడ్ గా ముందుకు సాగుతుంటే జాతీయ పార్టీలు మాత్రం ఇంకా ఆ వేగాన్ని అందుకోలేక చతికిలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక కూడా చేయలేదు. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బీజేపీ తేల్చలేదు. మరోవైపు టీడీపీ, జనసేన సందిగ్ధంలో పడ్డాయి.
టీడీపీ – జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పొత్తులు పెట్టుకున్నాయి. రెండు పార్టీలూ ప్రచారాన్ని కూడా ఉమ్మడిగా చేస్తున్నాయి. క్షేత్రస్థాయి వరకూ కేడర్ ను కలిసి పనిచేశేలా దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇప్పటికే ఆ రెండు పార్టీలూ 99 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రెండో జాబితా ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరో దఫా చర్చలు కూడా జరుపుతున్నారు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకా చేయలేదు. బీజేపీ వస్తుందేమో చూసి దాన్ని బట్టి పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు.
బీజేపీ మాత్రం టీడీపీ, జనసేన కూటమిలో చేరాలా వద్దా అనే దానిపై ఇంతవరకూ తేల్చలేదు. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పలువురు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో పురంధేశ్వరి నేతృత్వంలో వడపోత కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఎక్కువ మంది నేతలు పొత్తుతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని సూచించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఏపీ నుంచి ఒక్కరికి కూడా సీటు దక్కలేదు. దీన్ని బట్టి పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అర్థమవుతోంది. ఇవాళ, రేపు ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగే అవకాశం ఉంది.
బీజేపీ పెద్దల పిలుపుకోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎదురు చూస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి వీళ్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 8న పొత్తు ప్రకటన ఉంటుందని సమాచారం. టీడీపీ – జనసేన కూటమితో పొత్తు పెట్టుకునేందుకే బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న సమాచారం. బీజేపీ కోసం రెండో జాబితా అనౌన్స్ చేయకుండా టీడీపీ – జనసేన వెయిట్ చేస్తున్నాయి. అంతేకాక బీజేపీ కోసం మొదటి జాబితాలో అవసరమైన చోట మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది. 2-3 రోజుల్లోనే బీజేపీ చేరికపై క్లారిటీ రానుంది.













