ఎన్440కె వైరస్ పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

ఏపీలో ఎన్440కె వైరస్ విజృంభిస్తోందన్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్ లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఏపీలో ఎన్440కె వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరగలేదన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.
కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ జవహర్ రెడ్డి వివరణ
రాష్ట్రంలో కొత్త రకం కరోనా ఎన్440కే వేరియంట్ విస్తరణపై ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఎన్440కే వైరస్ ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదన్నారు. ప్రతీ నెలా సీసీఎంబీకి 250 నమూనాలను పంపుతున్నామని, ఏపీ, తెలంగాణ, కర్నాటక నుంచి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్‌కి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్440కె వైరస్ దక్షిణ భారతం నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారని వెల్లడించారు. 2020 జూన్, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్నాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారని, దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించిందని వెల్లడించారు. అయితే మార్చి నెలలో పూర్తిగా వెళ్లిపోయిందని, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పమని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.