ఐక్యరాజ్యసమితిలో బలూచ్ కు అమెరికా అండ..!
అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళ్తోంది. ఓ వైపు పాకిస్తాన్ ను మిత్రదేశంగా అభివర్ణిస్తుంది. పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు.. చాలా ఇష్టమైన వ్యక్తులు. ట్రంప్ ఏం ఆదేశించినా, కచ్చితంగా దాన్ని చేసి తీరతారని వేరే చెప్పక్కరలేదు. అయితే అలాంటి పాకిస్తాన్ కు.. అమెరికా షాకిచ్చింది. బలూచ్ రెబల్స్ పై ఉగ్రవాద ముద్ర పడకుండా.. అడ్డుకుంటోంది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లు తయారైంది.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్, చైనాలకు దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), మజీద్ బ్రిగేడ్లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా భద్రతా మండలిని ఒప్పించేందుకు ఆ రెండు దేశాలు చేసిన ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌కు చెందిన ఆ రెండు బలోచ్ సంస్థలకూ అల్‌ఖైదాతో గానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కానీ సంబంధాలున్నాయని తెలిపే సాక్ష్యాలేవీ లేవని అమెరికా స్పష్టంచేసింది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్లతో సంబంధాలున్నవారిపై మాత్రమే ఉగ్రముద్ర వేసి వారిపై ఆంక్షలు విధించే ఆనవాయితీని ఐక్యరాజ్యసమితి కొనసాగిస్తోంది.
బీఎల్ఏ, మజీద్ బ్రిగేడ్లకు భారత్ సాయమందిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఆ రెండింటినీ ఐక్యరాజ్యసమితి ఉగ్రసంస్థలుగా గుర్తిస్తే భారత్‌ను ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న దేశంగా ప్రచారం చేయవచ్చన్నది పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసీం మునీర్ ఎత్తుగడ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బలోచ్ సంస్థలను ఐక్యరాజ్యసమితి ఉగ్ర సంస్థలుగా గుర్తించేలా చేసేందుకు పాకిస్థాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే భారత్ ఈ విషయంలో ఫ్రాన్స్ మద్దతుతో అమెరికాపై ఒత్తిడి తెచ్చి పాక్, చైనాల ఎత్తుగడను తిప్పికొట్టిందని మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.








