ట్రంప్ వార్నింగ్స్.. మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్..
పశ్చిమాసియాలో మళ్లీ ప్రకంపనలు రేగాయి. ఓ వైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల ప్రయత్నాలు జరుగుతుండగానే.. హర్మూజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. దీనికి అమెరికా పెడదోరణే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ పేర్కొంది.
‘‘హర్మూజ్ జలసంధిపై నియంత్రణ మునుపటి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం.. జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హర్మూజ్‌లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ స్పందన వచ్చింది.
మరోవైపు, దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను తిరిగి తెరవడంతో పాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
ఓవైపు లెబనాన్ లో సీజ్ ఫైర్ కు ఇజ్రాయెల్ అంగీకరించడంతో.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. అన్ని నౌకలకు ఫ్రీగా తిరిగేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించింది కూడా. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. బుధవారంలోగా తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేకుంటే, ఇరాన్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. అంతవరకూ ఇరాన్ నౌకలు, నౌకాశ్రయాల దిగ్భందనం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో ఇరాన్ తిరిగి హర్మూజ్ జలసంధిని మూసేసింది.







