డెడ్ లైన్ దాటితే బాంబుల వర్షమే .. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక..!
హర్మూజ్ జలసంధిని తెరిపించిన ట్రంప్.. ఇప్పుడు తమ తదుపరి లక్ష్యాలపై ఫోకస్ పెట్టారు. ఈనెల 21తో తాను ఇరాన్ కు ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుందన్న ట్రంప్… ఆలోగా తమతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కు వార్నింగిచ్చారు. లేదంటే.. దానిపై మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించారు. ఆరిజోనాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగియనుంది. ఈలోపే ఒక ఒప్పందం చేసుకోవాలని ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ (Iran)కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా ఓ ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒప్పందం కుదరకపోతే.. 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపారు. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతోందన్నారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.
ఇరాన్‌తో కలిసి దాని అణుకేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను భౌతికంగా వెలికితీయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దాన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని వెల్లడించారు. ఈసందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. శుద్ధి చేసిన యురేనియం (Enriched Uranium) నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇంతకుముందు కూడా ప్రకటించారు.
అయితే, టెహ్రాన్ వీటన్నింటిని కొట్టిపారేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించేది లేదని ఆ దేశ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.







