Islamabad: నమ్మకం లేని చోట చర్చల సఫలమయ్యేనా..?
ప్రపంచంలో ఎక్కడా జరగని, వింతైన సమావేశానికి ఇస్లామాబాద్ వేదికైంది. ఓవైపు ఎలాగైనా చర్చల్లో ఇరాన్ ను లొంగదీయాలని అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. మరోవైపు.. అసలు అమెరికాపై నమ్మకమే లేదంటోంది ఇరాన్. తమ డిమాండ్లను సైతం అమెరికా ముందుంచింది. ఈ డిమాండ్లకు ఓకే చెబితేనే చర్చలంది. చివరాఖరుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్… చర్చల ప్రక్రియకు ఇరాన్ సహకరించకుంటే.. మిలటరీనే నమ్ముకుంటామనడం, పాకిస్తాన్,ఇతర ముస్లిం దేశాల ఒత్తిడితో ఇరాన్ ప్రతినిధి బృందం పాక్ చేరింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi), పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొననుంది. అయితే, ముందస్తు షరతులకు యూఎస్ అంగీకరిస్తేనే.. చర్చలు ముందుకుసాగుతాయని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని పేర్కొంది. రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సహా పలువురు సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు కూడా ఈ బృందంలో ఉన్నారు.
అమెరికాపై నమ్మకం లేదు: ఘాలిబఫ్
ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌పై తమకు మంచి అభిప్రాయం ఉన్నా.. నమ్మకం మాత్రం లేదని వ్యాఖ్యానించారు. యూఎస్‌తో గతంలో ఎదురైన అనుభవాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండుసార్లు చర్చలు జరుగుతుండగానే తమపై దాడికి పాల్పడ్డారన్నారు. తమ ప్రజల హక్కులను యూఎస్ గుర్తిస్తే.. వారితో ఒప్పందానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, చర్చలను ఒక ప్రచారంగా పరిగణిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య చర్చలు
పాక్‌లో శాంతి చర్చలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. యూఎస్‌లోని లెబనాన్- ఇజ్రాయెల్ (Lebanon- Israel) రాయబారులు ఫోన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ, వ్యవస్థీకృత చర్చలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ఈ సంభాషణ జరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఈనెల 14న అధికారిక సమావేశం కోసం ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపాయి.







