Union Budget 2026: మధ్యతరగతికి పన్ను ఊరట.. క్యాన్సర్ మందులు ఇక చౌక!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్లో 2026 కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2026) ప్రవేశపెట్టారు. మౌలిక వసతులు, తయారీ రంగం, సాంకేతికతకు పెద్దపీట వేస్తూనే.. సామాన్యులకు ఊరటనిచ్చే పలు కీలక ప్రకటనలు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అద్దం పడుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రధాని మోదీ అభివర్ణించారు.
ఆదాయపు పన్ను చెల్లింపు ప్రక్రియను సరళతరం చేస్తూ కొత్త ఇన్కమ్ టాక్స్ చట్టాన్ని (ఏప్రిల్ 1, 2026 నుండి) తీసుకువస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ (Union Budget 2026) ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విదేశాలకు పంపే డబ్బుపై (TCS) పన్నును 5% నుండి 2 శాతానికి తగ్గించారు. ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, వైద్యం చేయించుకునే వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించింది. 17 రకాల అత్యవసర క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బడ్జెట్లో (Union Budget 2026) కేంద్రం ప్రకటించింది. దీంతో చికిత్స ఖర్చు భారీగా తగ్గనుంది. రక్షణ రంగానికి ఈసారి బడ్జెట్లో (Union Budget 2026) 15% నిధులు పెంచి రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు (Capex) రూ. 12.2 లక్షల కోట్లను కేటాయించి రికార్డు సృష్టించారు. కొత్తగా 20 జల రవాణా మార్గాలు, డాంకునీ-సూరత్ మధ్య సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దేశంలో కృత్రిమ మేధ (AI), డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను రాయితీలు ప్రకటించారు. సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా చిప్ తయారీకి ఊతమివ్వనున్నారు. దీని కోసం బడ్జెట్లో (Union Budget 2026) ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. ఈ బడ్జెట్ దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే మార్కెట్లు మాత్రం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపు పట్ల ప్రతికూలంగా స్పందించాయి.






