వారణాసి అశోక చక్రం వివాదం.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు!
Supreme Court: జాతీయ పతాకంపై అశోక చక్రం ప్రదర్శన తీరుకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వారణాసిలోని ఒక కూడలిలో ఉన్న అశోక చక్రాన్ని ఉదాహరణగా చూపుతూ దాఖలైన ఈ వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల కంటే సమాజానికి మేలు చేసే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలని పిటిషనర్‌కు సూచించింది.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు గురికావాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలో నిజాయితీ ఉండొచ్చు, కానీ ఇలాంటి సాంకేతిక అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి” అని స్పష్టం చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేయకుండా, సామాజిక శ్రేయస్సుకు తోడ్పడే నిర్మాణాత్మక పనుల వైపు దృష్టి సారించాలని ధర్మాసనం హితవు పలికింది.
బాధ్యతాయుతంగా..
గతంలో న్యాయవాది సచిన్ గుప్తా దాఖలు చేసిన పలు పిల్స్ అస్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే ఆయన సమర్పించిన 47 పిటిషన్లలో పెద్దగా ప్రాధాన్యత లేని వాటిని వెనక్కి తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు స్పందించిన సచిన్ గుప్తా.. న్యాయస్థానం అనుమతితో తన పిటిషన్లను ఉపసంహరించుకుంటానని ధర్మాసనానికి విన్నవించారు. న్యాయవ్యవస్థ సమయాన్ని సద్వినియోగం చేసేలా పిటిషనర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది.
ఇవి కూడా చదవండి








