కాంగ్రెస్ కి షాక్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపారు. పెండింగ్లో ఉన్న ఒక కోర్టు కేసు వివరాలను మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్లో పేర్కొనలేదని బీజేపీ ఆరోపించింది. ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన అనంతరం నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
స్పందించిన మీనాక్షి నటరాజన్..
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ తిరస్కరణ అయిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ స్పందించారు. తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ అధికార భారతీయ జనతా పార్టీ మూడవ అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఈ పరిణామాలన్నీ మొదలయ్యాయని మండిపడ్డారు.రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా వారు రాజకీయాలు చేస్తున్నారన్న అన్నారు.మ్మెల్యే కాని వ్యక్తిని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు, ఇది రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే రాజకీయమని స్పష్టమైందని ఆమె అన్నారు. ఈ నిర్ణయం బీజేపీ ఉద్దేశాలను, విధానాలను బయటపెట్టిందన్నారు.
కాంగ్రెస్ స్పందన ఇదీ…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె నామినేషన్లో ఏదైనా తప్పు లేదా వివరాలను వెల్లడించలేదనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని పేర్కొన్నారు.








