కాంగ్రెస్ కు పీసీ చాకో రాజీనామా
సరిగ్గా ఎన్నికల సమరాంగణాన్ని చూసి కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చాకో ప్రకటించారు. కేరళ రాజకీయంపై ఈసారి కాంగ్రెస్ కాస్త ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు వచ్చి తీరుందన్న ఆశ రాష్ట్ర నేతల్లో ఉంది. అయితే చాకో లాంటి నేత రాజీనామా చేయడం కాంగ్రెస్‌కి ఎదురు దెబ్బే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు ఆయన వెల్లించారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందని, పార్టీలో కొనసాగే పరిస్థితి ఏమాత్రం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని చాకో ప్రకటించారు. కొన్ని రోజులుగా అత్యంత చరిత్రాత్మకమైన పార్టీకి అధ్యక్షుడు కూడా లేడని ఎద్దేవా చేశారు. పార్టీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, విమర్శలను స్వీకరించే స్థాయిలో అధిష్ఠానం లేదని విమర్శించారు. ఆత్మాభిమానం గల్ల నాయకుడెవరూ కేరళ కాంగ్రెస్‌లో ఉండరన్నారు. అయితే బీజేపీలో మాత్రం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా. ఈ లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపుతున్నాను. కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను. నేను కేరళ నుంచి వచ్చాను. అక్కడ కాంగ్రెస్సే లేదు. ఉన్నవల్లా రెండు పార్టీలే. ఒకటి కాంగ్రెస్ (ఐ), రెండోది కాంగ్రెస్ (ఏ). ఒకదానికి ఊమెన్ చాందీ నాయకత్వం వహిస్తే, మరోదానికి రమేశ్ చెన్నితల నాయకత్వం వహిస్తారు.’’ అంటూ చాకో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేరళ అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కోబోతోందని, తిరిగి కాంగ్రెస్సే అధికార పగ్గాలను చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపిజం అధికారం చేపట్టే ప్రక్రియకు అడ్డు తగులుతోందని నిప్పులు కక్కారు. అయితే ఈ విషయంపై అధిష్ఠానంతో నిత్యం చర్చిస్తూనే ఉన్నానని, హైకమాండే ఈ గ్రూపిజాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే సోనియా, రాహుల్ పేర్లను మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో రాష్ట్ర నేతలెవ్వర్నీ సంప్రదించలేదని చాకో మండిపడ్డారు.













