పాత మహిళా బిల్లును రద్దు చేసి.. కొత్తది ప్రవేశపెట్టాలి: రాహుల్ గాంధీ
Rahul Gandh: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై లోక్సభ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మహిళలకు సాధికారత కల్పించడం కంటే, ఈ బిల్లు ద్వారా దేశ రాజకీయ రూపురేఖలను మార్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. లోక్సభలో జరిగిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023లోనే ఆమోదం పొందిందని, దానిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. “ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు మహిళల కోసం చేసినవి కావు. ఈ బిల్లు మాటున రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పాత బిల్లును రద్దు చేసి,కొత్తది తీసుకురావాలి..
కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సూచన చేస్తూ.. ఒకవేళ నిజంగానే మార్పులు చేయాలనుకుంటే, పాత మహిళా రిజర్వేషన్ బిల్లును రద్దు చేసి, కొత్తగా మళ్లీ తీసుకురావాలని రాహుల్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ వంటి అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.
మహిళా రిజర్వేషన్లు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.








