Mamata Banerjee: ఓటర్ల జాబితా సవరణపై భగ్గుమన్న దీదీ.. మోదీపై ఫైర్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వేడి క్రమంగా తారస్థాయికి చేరుకుంటోంది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee).. భారతీయ జనతా పార్టీ (BJP)పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ముసుగులో బెంగాల్ ప్రజల హక్కులను కాలరాయాలని కేంద్రం కుట్ర చేస్తోందని, ఆ ప్రయత్నాలను తాను ప్రాణమున్నంత వరకు అడ్డుకుంటానని ఆమె ఘాటుగా హెచ్చరించారు.
రంజాన్ వేదికగా బీజేపీపై రణభేరి..
సెంట్రల్ కోల్కతాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న దీదీ (Mamata Banerjee).. ఈ ఆధ్యాత్మిక వేదికను కేంద్రంపై పోరాటానికి మలుచుకున్నారు. ‘సర్’ (SSR) ప్రక్రియ పేరుతో రాష్ట్రంలోని అనేక మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా బెంగాల్ ప్రజలందరికీ తాను అండగా నిలబడి, ఈ అన్యాయంపై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోందని, అవసరమైతే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా వెనుకాడటం లేదని మమత (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ ఉనికిని తుడిచిపెట్టి, ఆ పార్టీ నుంచి దేశాన్ని రక్షించడమే తమ ప్రథమ లక్ష్యమన్న మమత.. కొందరు ద్రోహులు బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మైనార్టీ ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఓటమి భయంతోనే: బీజేపీ
ప్రధాని మోదీపై మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ముఖ్యమంత్రిని వెంటాడుతోందని, ఆ ఆందోళనలోనే ఆమె ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత శిశిర్ బజోరియా ‘ఎక్స్’ (X) వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రధానిని మైనార్టీ వ్యతిరేకి అని విమర్శించిన మమతకు.. ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని ఆయన దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి








