Vairamuthu: సాహిత్య శిఖరం వైరముత్తుకు 60వ జ్ఞానపీఠ్ పురస్కారం
తమిళ సాహిత్య, సినీ రంగాల్లో తనకంటూ ఒక సుస్థిర అధ్యాయాన్ని లిఖించుకున్న ప్రముఖ కవి, రచయిత, గీత రచయిత ఆర్. వైరముత్తుకు (Vairamuthu) దేశ అత్యున్నత సాహిత్య గౌరవం దక్కింది. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ’60వ జ్ఞానపీఠ్ పురస్కారాని’కి ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం ఢిల్లీలో ప్రొఫెసర్ ప్రతిభా రే నేతృత్వంలో సమావేశమైన భారతీయ జ్ఞానపీఠ్ పాలక మండలి ఈ మేరకు అధికారిక నిర్ణయం తీసుకుంది.
తమిళ సాహిత్యంలో మూడో వ్యక్తిగా ఘనత
భారతీయ భాషల్లో అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన గుర్తింపు ఉన్న తమిళ భాష నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంటున్న మూడో వ్యక్తిగా వైరముత్తు (Vairamuthu) చరిత్ర సృష్టించారు. గతంలో తమిళ సాహిత్యం నుంచి పీవీ అకిలన్ (1975), డి. జయకాంతన్ (2002) మాత్రమే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. తాజా పురస్కారం కింద విజేతకు రూ. 11 లక్షల నగదు బహుమతి, ప్రశంస పత్రంతో పాటు వాగ్దేవి (సరస్వతి) కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేయనున్నారు.
సాహిత్య ప్రస్థానం, సినీ వైభవం
1953లో తమిళనాడులోని తేని జిల్లా మేట్టూర్లో జన్మించిన వైరముత్తు (Vairamuthu).. విద్యార్థి దశలోనే అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఆయన కళాశాల రోజుల్లో రచించిన ‘వైకరై మేఘంగళ్’ కవితా సంపుటి ఏకంగా అప్పట్లోనే ఒక మహిళా కళాశాలలో పాఠ్యాంశంగా ఎంపికవడం విశేషం. రాష్ట్ర అధికార భాషా కమిషన్లో పనిచేసిన ఆయన.. 1980లో ‘నిళల్గల్’ చిత్రంతో సినీ గీత రచయితగా అరంగేట్రం చేశారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో 7,500కి పైగా సినీ గీతాలకు ప్రాణం పోశారు. ఉత్తమ గీత రచయితగా ఏకంగా 7 సార్లు జాతీయ పురస్కారాలు, 6 సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకున్న కవి ఆయన.
సామాజిక స్పృహతో కూడిన రచనలు
కేవలం పాటలకే పరిమితం కాకుండా సుమారు 40కి పైగా పుస్తకాలను వైరముత్తు (Vairamuthu) రచించారు. అందులో ‘కళ్లికాట్టు ఇతిగాసం’, ‘కరువాచ్చి కావియం’, ‘తన్నీర్దేశం’, ‘మూడ్రం ఉలగపోర్’ లాంటి రచనలు తమిళ సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచాయి. మానవ సంబంధాల సున్నితత్వం, ప్రకృతి పట్ల లోతైన అవగాహన, సామాజిక బాధ్యత ఆయన ప్రతి అక్షరంలోనూ ప్రతిఫలిస్తుంటాయి. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాన్ని సైతం అందుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు సమీపిస్తున్న తరుణంలో, ఆ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రజాదరణ ఉన్న కవిని (Vairamuthu) ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.








