ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండీ కూటమి
ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం దేశ రాజధానిలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమయ్యారు. కూటమిలోని అన్నీ పార్టీల నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఐదు కీలక నిర్ణయాలను ఇండియా కూటమి నేతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఐదు నిర్ణయాలకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఎస్ఐఆర్, నీట్-సీబీఎస్ఈ పరీక్షల వివాదం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, అణగారిన వర్గాల సమస్యల వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇండియా కూటమి తదుపరి సమావేశం తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు.
1. నీట్, సీబీఎస్ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
2. ఎస్ఐఆర్, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు.
3.ప్రతి రెండు నెలలకోసారి ఇండియా కూటమి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని ఆగస్టు 8న హైదరాబాద్లో నిర్వహించాలని తీర్మానించారు.
4.దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు సహా ఇతర సమస్యలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
5. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కూటమి ఎంపీలు ప్రతిరోజూ ఉదయం సమావేశమై కార్యాచరణపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ హాజరయ్యారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీలతో పాటు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీపీ(ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్, సీపీఐకి చెందిన డి.రాజా, మరికొన్ని చిన్న పార్టీల నాయకులూ ఈ చర్చల్లో పాల్గొన్నారు.








