భారత రైల్వేశాఖ మరో ఘనత!
భారత రైల్వేశాఖ మరో ఘనత సాధించేందుకు చేరువైంది. జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశ మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం సిద్ధమైంది. రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో ఈ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. వంతెనను మొత్తంగా 98 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు తెలిపారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని వెల్లడిరచారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు. అంజీ ఖడ్ తీగల రైల్వే వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా -రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య అంజీ ఖడ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకుంటుందని అధికారులు తెలిపారు.













