రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం
రాజ్యసభ సభ్యుడిగా డా.కె.లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం ఢిల్లీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి సీఎం కేసీఆర్ లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, టీఆర్ఎస్ కట్టప్పల విషయంలో బీజేపేదీ ప్రేక్షకపాత్ర మాత్రమేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక ట్రైలర్ మాత్రమేనని సినిమా ముందుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. కేసీఆర్ దిక్కు తోచని స్థితిలో ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటానికి బీజేపీ జమిలి ఎన్నికలను కోరుకుంటుందన్నారు.













