1984 నుంచి రాజ్యాంగ సవరణ అనేది విస్తృత ఏకాభిప్రాయంగా ఎందుకు మారిందో తెలుసా?
ఇప్పుడు చర్చంతా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపైనే. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు కూడా దీని గురించే మాట్లాడుతున్నాయి. లోక్ సభలో సరైన మెజారిటీ లేని కారణంగా బిల్లు వీగిపోయిందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు కూడా. దీంతో రాజకీయ నేతల మధ్య వాదోపవాదాలు పెరిగిపోయాయి. ప్రతిపక్షం దీనిపై తమ విజయమని ప్రకటించుకుంటాయి. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 కింద ఈ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ఆమోదం పొందడానికి సభ్యులలో మూడింట రెండు వంతుల మద్దతు అవసరమైంది. మొత్తం సభ్యుల సంఖ్య 540 ఆధారంగా, 360 ఓట్లు అవసరమయ్యాయి; అయితే, అధికార ప్రభుత్వానికి కేవలం 293 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది.
అయితే.. అసలు విషయం ఏమిటంటే చివరి సారిగా ఎప్పుడు, ఏ ప్రభుత్వ హయాంలో ఓ రాజకీయ పార్టీ లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని (అంటే 360 మంది సభ్యులు) తో కేవలం తన సొంత బలంపైనే ఆధారపడి, ఓ రాజ్యాంగ సవరణ బిల్లును విజయవంతంగా ఆమోదింపజేసుకుందో తెలుసా?
నిజానికి భారత పార్లమెంటరీ రాజకీయాలలో రాజ్యాంగ సవరణల వంటి కీలక విషయాలలో విస్తృత ఏకాభిప్రాయం కోరే సంప్రదాయం వుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఇది మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే.. 1984 నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సొంతంగా మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది.
అయితే.. 1984 లో మాత్రం సార్వత్రిక ఎన్నికల సమయంలో కనిపించింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఏకంగా 414 స్థానాలను గెలుచుకొని భారీ మెజారిటీని సాధించింది. ఈ అఖండ ప్రజా తీర్పు ఆధారంగా, ఆ ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీనిని ‘‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’’ గా పేర్కొంటారు. భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ధోరణికి అడ్డుకట్ట వేయడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశం.
అయితే.. లోక్ సభలో రాజీవ్ కి భారీ మెజారిటీ వున్నా… ఆ ప్రభుత్వం అన్ని రంగాలలో విజయం సాధించలేకపోయింది. 1989 లో పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన 64 వ రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. ఆమోదం పొందలేదు. దీని ద్వారా తెలిసొచ్చింది ఏమంటే.. కేవలం లోకసభలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ వుంటే సరిపోదని, రాజ్యసభలో కూడా అంటే పార్లమెంటు ఉభయ సభల మద్దతు తప్పనిసరి అని రూఢీ అయ్యింది. రాజ్యాంగంలోని అధికరణం 368 ప్రకారం, ఒక సవరణ ఆమోదం పొందాలంటే సభ్యులలో మూడింట రెండు వంతుల మంది మద్దతు అవసరం.అప్పటి అధికార ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది; అయితే, లోక్సభలో ఆ ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. అంతేకాకుండా, ఈ విషయంపై సభలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ బిల్లు వీగిపోయింది.
రాజీవ్ గాంధీ తర్వాత సంకీర్ణ శకాలు…
రాజీవ్ గాంధీ తర్వాత 1990 లో సంకీర్ణ రాజకీయాల శకం వచ్చేసింది. దీనొతో ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అనివార్యమైంది. 1992 లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించడం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించింది.
ఇది 73వ రాజ్యాంగ సవరణగా అమల్లోకి వచ్చింది, తద్వారా గ్రామీణ స్వపరిపాలనకు నూతన బలం చేకూరింది. ఈ విధంగా, లోక్సభలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ సాధించలేకపోయిన కార్యాన్ని, నరసింహారావు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం ఏకాభిప్రాయం ద్వారా విజయవంతంగా పూర్తి చేసింది.
1984 నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వయంగా మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడం వల్ల, రాజ్యాంగ సవరణ అనేది విస్తృత ఏకాభిప్రాయం ద్వారానే సాధ్యమన్న అంశంగా మారిపోయింది. ఈ కారణంగానే ఇటీవలి ప్రభుత్వాలు రాజ్యాంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపడం, వారి మద్దతును కూడా కూడగట్టడం చేస్తున్నాయి.








