అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు… ‘‘ప్రజా సంపర్క్’’ పేరుతో ప్రజల్లోకి
కేంద్రంలో అధికారంలోకి వచ్చి, ఎన్డీయే ప్రభుత్వానికి 12 సంవత్సరాలు నిండబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ 12 సంవత్సరాలలో భారత దేశానికి తాము ఏం చేశామనో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆర్థిక విషయంలో, విదేశాంగ విధానంలో.. ఇలా కొన్ని రంగాల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల ముందుకు తేవాలని, దీని ద్వారా ఇండియా కూటమి విమర్శలకు మరింత చెక్ పెట్టాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ‘‘ప్రజా సంపర్క్’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం ‘12 ఏళ్లు: విశ్వసనీయత, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం’ అనే ఇతివృత్తం మరియు నినాదం కేంద్రంగా సాగుతుంది.
5 పుస్తకాలు.. అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల…
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తన విజయాల పరంపరతో కూడిన వివరణాత్మక సమాచారంతో పుస్తకాలను కూడా ముద్రిస్తోంది. ఈ పుస్తకాలు ఐదు అంశాలపై వుంటాయి. ఈ ఐదు రకాల పుస్తకాలు కూడా ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ముద్రితం చేయనున్నారు.ఈ ఐదు పుస్తకాలు సమిష్టిగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధాన నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు దేశ నిర్మాణ ప్రయత్నాలను వివరిస్తాయి.
ఇవి కూడా చదవండి
1. రాష్ట్ర ప్రథమ్ (దేశమే ప్రథమం)
గత 12 ఏళ్లలో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై ఈ కరదీపిక దృష్టి సారిస్తుంది. సైనిక విజయాలు, ‘ఆపరేషన్ సింధూర్’ మరియు సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాలతో సహా, దేశ భద్రతను మరియు భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేసిన చర్యలను ఇందులో వివరిస్తారు.
2. జన్ సేవా కా సంకల్ప్ (ప్రజా సేవలో అంకితభావం)
ఇందులో దేశ ప్రజల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను కూడా ఇందులో వివరిస్తారు. విభిన్న సామాజిక-ఆర్థిక సమూహాలకు చెందిన పౌరుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను వివరంగా తెలుపుతున్నారు.
3. సాధికారత నుంచి సమృద్ధి వరకు…
ఈ పుస్తకంలో మహిళలు – కేంద్రీకృత విధానాల కార్యక్రమాలపై వివరిస్తారు. మహిళలకు సాధికారత కల్పించడానికి, వారికి ఆర్థిక స్వాతంత్రం, నాయకత్వం, త్రిపుల్ తలాక్ ఎత్తివేత లాంటివి ప్రచురిస్తారు. అలాగే మహిళల ఆర్థిక స్వాతంత్రం, నాయకత్వం, స్వావలంబనను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారు.
4. అభివృద్ధితో పాటు వారసత్వం కూడా..
వేగవంతమైన ఆధునికీకరణ, సాంకేతిక పురోగతితో పాటు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహానికి మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇందులో వివరిస్తారు.
5. దేశ నిర్మాణం…
దేశ అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేసేందుకు వివిధ రంగాలలో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టులు మరియు కార్యక్రమాల వివరాలతో సహా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం చేపట్టిన చర్యల సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.








