‘యోగి’’ సారథ్యంలోనే ఎన్నికలకు.. ఇప్పుడే అధికారికంగా ప్రకటించిన బీజేపీ
ఉత్తరప్రదేశ్.. మినీ ఇండియా అని పిలుస్తాం. రాజకీయంగా అన్ని పార్టీలకు కూడా ఇది అత్యంత ముఖ్యమైన రాష్ట్రం. యూపీలో అధికారం చేపడితే.. దేశంలో అధికారం వచ్చినట్లే అన్న నానుడి కూడా బాగా వుంది. అయితే.. యూపీలో తిరిగి మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలని అధికార బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తోంది. నిజానికి వచ్చే యేడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ వేడి మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని దాద్రి నుంచి సమాజ్ వాదీ ‘‘తన మిషన్ 2027’’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక.. బీజేపీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడించింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోనే వెళ్తామని బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు.ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఆయన నాయకత్వంలోనే పనిచేస్తోంది. అందువల్ల, నిస్సందేహంగా ఆయనే మా నాయకుడు అవుతారు’’ అంటూ కుండబద్దలు కొట్టారు.దీని ద్వారా వరుసగా మూడోసారి యూపీలో అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.
ఒకప్పుడు దోపిడీలు, నేరాలకు పేరుగాంచిన యూపీ రాష్ట్రం, ఇప్పుడు మెరుగైన శాంతిభద్రతలు, అభివృద్ధికి ముఖచిత్రంగా మారిపోయిందన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన సుపరిపాలన, అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో, ఉత్తరప్రదేశ్ నిస్సందేహంగా దేశంలోని అగ్రగామి రాష్ట్రాలకు దీటుగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల వృద్ధిని పెంపొందించామని, దీని ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి
2017 లో అధికారంలోకి బీజేపీ…
దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2017 లో బీజేపీ యూపీని చేజిక్కించుకుంది. తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరన్నది బీజేపీ అధిష్ఠానం అస్సలు ప్రకటించనే లేదు. కేశవ ప్రసాద్ మౌర్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా వుండేవారు. జాతీయ అధ్యక్షునిగా ఇప్పటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వుండేవారు. యూపీలో పాగా వేయడానికి మోదీ, అమిత్ షా ‘‘సోషల్ ఇంజినీరింగ్’’ చేపట్టారు. దీంతో యూపీ బీజేపీ కైవసమైంది. ఆ తర్వాతనే ఎంపీగా వున్న యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. అప్పుడు అందరూ ఆశ్చర్యంలోనే మునిగిపోయారు.
గత ఐదేళ్ల కాలంలో, హిందుత్వపై తన దృష్టిని కేంద్రీకరిస్తూనే, ముఖ్యమంత్రి యోగి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఒక పటిష్టమైన పునాది వేశారు. 2022 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఆ పార్టీ మెజారిటీ మార్కును మించిన స్థానాలనే సాధించింది. తత్ఫలితంగా, బీజేపీ ముఖ్యమంత్రి యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, అభివృద్ధిలో యూపీని టాప్ లో వుంచుతున్నారు.
10 సంవత్సరాలలోనే ‘‘దటీజ్ యోగి’’ అనిపించుకున్న సీఎం…
పది సంవత్సరాల క్రితం యూపీ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? అన్నది బీజేపీలో పెద్ద ప్రశ్నార్థకం. కొంత మంది సీనియర్లు వున్నా.. పరిపాలన విషయంలో, సోషల్ ఇంజినీరింగ్ విషయంలో బీజేపీ కాస్త హైరానా పడింది. ఓబీసీ వర్గం నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా కేశవ ప్రసాద్ మౌర్య వుండేవారు. ఆయనే ముఖ్యమంత్రిగా వుంటారని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ.. హఠాత్తుగా బీజేపీ అప్పుడు ఎంపీగా వున్న యోగి ఆదిత్యనాథ్ ను ప్రకటించింది. అప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టి, ఆయనేంటో నిరూపించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి








