గడ్డుకాలమే..?
మాంద్యం భయం వేధిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా పరిణమిస్తుండడం, తగ్గుతున్న ప్రొఫిట్స్ వెరసి ఐటీ పరిశ్రమకు రానున్నది గడ్డుకాలంగా మారుతోంది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు.. ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. దీంతో ఇదే బాటలో చాలా కంపెనీలు పయనిస్తుండడం.. ఐటీ ఉద్యోగులను ఆందోళన పెడుతోంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. మరో సంస్థ విప్రో తొలి త్రైమాసికానికి ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని 80శాతానికి పరిమితం చేసింది. అయితే ఇందులో టీసీఎస్ కాస్త బెటర్‌గా ఉందని. ఇటీవలి ఫలితాల తరువాత వేతన పెంపుదలలు సగటున 6-8 శాతం మధ్య టాప్ పెర్ఫార్మర్లు 12-15 శాతం వరకు పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఐటీ మేజర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. చాలామంది ఫ్రెషర్లను తొలగించాయి. ఇది చాలదన్నట్టు తాజాగా వేతనాల పెంపును వాయిదా వేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగుల వార్షిక వేతనాల్లో కోత విధించేందుకు యోచిస్తున్నాయని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇది పరిశ్రమలో నెలకొన్న గడ్డు పరిస్థితులను అద్దం పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే వచ్చే ఏడాది మరింత కష్టకాలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఐటీ ఇండస్ట్రీ దూసుకుపోయింది. అయితే పరిస్థితి ఇప్పుడు మాత్రం మారింది. ఐటీ ఉద్యోగం, ఆఫర్ లెటర్లు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్న ఐటీ ఆశావహుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నాయి కంపెనీలు. డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమిని, ఆక్సెంచర్, మైండ్ ట్రీ, ఎంఫసిస్ లాంటి అనేక కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆన్ బోర్డింగ్ కంపెనీలను వారాలు, నెలుల ఆలస్యం చేస్తున్నాయి. చాలా మంది ఫ్రెషర్లు తమ జాయినింగ్ ఎప్పుడో చెప్పాలని కంపెనీలను అడుగుతున్నాయి. దీంతో తమ కెరీర్ ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది.
మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉక్రెయిన్ యుద్ధం.. ప్రపంచదేశాల్ని కలవరపెడుతోంది. దీనికి తోడు తైవాన్ విషయంలో చైనా దుందుడుకు వైఖరితో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నష్టాల్ని తగ్గించుకునేందుకు పాశ్చాత్యదేశాల్లోని కంపెనీలు ప్రయత్నిస్తుండడంతో.. వాటి ప్రభావం ఇండియాలోని దిగ్గజ పరిశ్రమలను వెంటాడుతోంది.













