విధిని వెక్కిరించిన విజేత.. ఒంటి చేత్తో డిజిటల్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ధీశాలి
Adilabad: శారీరక వైకల్యం కేవలం శరీరానికే కానీ ఆలోచనలకు కాదని నిరూపిస్తున్నారు అదిలాబాద్‌కు చెందిన వెంకటరమణ. గత 27 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా, తన అకుంఠిత దీక్షతో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎముకల బలహీనత వ్యాధితో (Osteogenesis Imperfecta) కనీసం కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్వయంసమృద్ధిని సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒక చేత్తో మొబైల్ ఫోన్ ఆపరేట్..
అదిలాబాద్ కైలాస్ నగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు సురేఖ , సంతోష్ కుమార్ కుమారుడైన వెంకటరమణ, పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోయినా ఇంటి నుండే చదువు కొనసాగించారు. ఓపెన్ స్కూల్ ద్వారా విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, కేవలం ఒక చేత్తో మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంతో పాటు, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ వంటి అత్యాధునిక కోర్సులను ఆన్లైన్లో అభ్యసించారు.
గూగుల్ మీట్ ద్వారా..
ప్రస్తుతం ఒక డిజిటల్ ఏజెన్సీలో టీమ్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు 50 వేల రూపాయల పైగా వేతనం పొందుతున్నారు. గూగుల్ మీట్ వంటి వేదికల ద్వారా సుమారు 300 మంది యువతకు డిజిటల్ మార్కెటింగ్ మెళకువలను నేర్పిస్తున్నారు. పడుకున్న స్థితిలోనే స్మార్ట్‌ఫోన్ సాయంతో ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ వృత్తిలో రాణిస్తున్నారు.
తల్లిదండ్రులకు గర్వకారణం..
సాధారణ వ్యక్తులే చిన్నపాటి కష్టాలకు కుంగిపోతున్న తరుణంలో, వెంకటరమణ సాధిస్తున్న విజయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. కుమారుడి పట్టుదలను చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు. వైకల్యం ఉన్నా ఎవరికీ భారం కాకుండా, పదిమందికి మార్గనిర్దేశనం చేస్తున్న వెంకటరమణ నిజమైన విజేత.








