చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందా? క్లారిటీ ఇదిగో
అసలే వేసవి కాలం. చల్లటి నీరు తాగాలని చాలా మంది తహతహలాడుతుంటారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందని మనలో చాలామంది గట్టిగా నమ్ముతుంటారు. వైద్య శాస్త్రం ప్రకారం ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. జలుబు లేదా ఫ్లూ రావడానికి వైరస్లు ప్రధాన కారణం తప్ప, నీటి ఉష్ణోగ్రత కాదు. ఈ వైరస్లు చల్లటి నీటిలో ఉండవు; ఇవి ప్రధానంగా గాలి ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లను ఇతరులు పీల్చడం వల్ల లేదా వైరస్ ఉన్న వస్తువులను తాకిన చేతులతో కళ్లు, ముక్కు, నోటిని రుద్దుకోవడం వల్ల మాత్రమే ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఉదాహరణకు, క్రీడాకారులు తమ శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిత్యం చల్లటి నీరే తాగుతుంటారు, కానీ వారికి దానివల్ల జలుబు రాదు.
చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా రావడానికి కూడా చల్లటి నీరు లేదా చలిగాలి కారణం కాదు. ఆ కాలంలో వాతావరణం పొడిబారి, గాలిలో తేమ తగ్గడం వల్ల వైరస్లు వృద్ధి చెందడానికి ఎక్కువ కాలం గాలిలో ఉండటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే చలి వల్ల ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే సమూహాలుగా ఉండటం వల్ల వైరస్ ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. దీనికి తోడు చలికాలంలో పెరిగే కాలుష్య కారకాలు శ్వాసనాళాల్లోని జిగురు పొరను దెబ్బతీస్తాయి, తద్వారా ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం పెరుగుతుంది. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల లక్షణాలు కొంత తీవ్రమైనట్లు అనిపిస్తాయి తప్ప, చల్లటి నీరు నేరుగా జలుబును కలిగించదు.








