ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజురావు
ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వాణి సర్రాజురావు నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెను ఇటలీలో రాయబారిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. అమెరికా కాలిఫోర్నియాలోని సాన్‌జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో ఎంఎస్ చేశారు. గతంలో ఆమె అమెరికాస్ డివిజన్ డైరెక్టర్, స్వీడన్‌లోని భారత రాయబార కార్యాలం ఫస్ట్ సెక్రటరీ, విదేశాంగ శాఖ కార్యలయంలో యూరప్ వెస్ట్ విభాగాల అండర్ సెక్రటరీగా సేవలందించారు. తొలి పోస్టింగ్ కింద మెక్సికో సిటీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలోని వాణిజ్య విభాగం అధిపతిగా, మిషన్ డిప్యూటీ చీఫ్‌గా సేవలందించారు. 2017 నుంచి 2020 వరకు ఫిన్‌ల్యాండ్, ఎస్తోనియా రాయబారిగా పనిచేశారు.













