నర్గెస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్ లాంటి దేశంలో పుట్టిన నార్గిస్ చదువుకునే రోజుల నుంచే మహిళ హక్కులపై గళమెత్తారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డీహెచ్ఆర్సీ) సెంటర్లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నర్గెస్ 13 సార్లు ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయిదు సార్లు ఆమెను దోషిగా నిర్దారించారు. ఆమెకు దాదాపు 31 ఏళ్ల జైలుశిక్షను వేశారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నది. ప్రస్తుతం మొహమ్మది ఇంకా జైలులోనే ఉన్నారు.













