Jaishankar: జైశంకర్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్.. బ్రిక్స్ సహకారం కోసం విజ్ఞప్తి
పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్న క్లిష్ట పరిస్థితుల మధ్య దౌత్యపరమైన మంతనాలు వేగవంతమయ్యాయి. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో (Jaishankar) ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. తాజా ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఈ ఇద్దరు అగ్ర నేతలు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది నాలుగోసారి కావడం ప్రస్తుత పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ కీలక సంభాషణలో ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా యుద్ధ పరిస్థితులను జైశంకర్‌కు (Jaishankar) వివరించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల వల్ల ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు వాటిల్లుతున్న ముప్పును ఆయన ప్రస్తావించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. తమ దేశ సార్వభౌమత్వంపై దాడులు జరిగినప్పుడు, తమను తాము రక్షించుకునే (సెల్ఫ్ డిఫెన్స్) పూర్తి చట్టబద్ధమైన హక్కు ఇరాన్‌కు ఉందని అరాగ్చీ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమ ప్రభుత్వం, భద్రతా దళాలు, ప్రజలు ఏకతాటిపై అత్యంత పట్టుదలతో ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సుస్థిరతను కాపాడేందుకు ‘బ్రిక్స్’ (BRICS) కూటమి దేశాలు సమన్వయంతో సహకరించాలని ఈ సందర్భంగా అరాగ్చీ విజ్ఞప్తి చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రితో జరిగిన ఈ ఫోన్ సంభాషణను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) కూడా అధికారికంగా ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. “ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీతో ఫోన్లో మాట్లాడాను. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు బ్రిక్స్ వేదికగా సాగాల్సిన సహకారం, సంబంధిత అంశాలపై మేం లోతుగా చర్చించుకున్నాం” అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్ పదేపదే భారత్‌తో సంప్రదింపులు జరపడం దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు బలమైన గొంతుకగా ఉన్న భారత్ మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ చర్చలు జరుపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.








