ఉదయం అల్పాహారంలో ఇవి మిస్ చేయొద్దు…
ఉదయం తీసుకునే అల్పాహారం రోజంతా శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్‌తో పాటు పేగుల ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాలను ఎంచుకుంటే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల తరచూ ఆకలి వేయడం తగ్గి, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉండొచ్చు. ఇలాంటి పోషకవంతమైన బ్రేక్‌ఫాస్ట్‌లను కేవలం 15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.. అది ఎలాగో చూద్దాం..
1. గ్రీక్ యోగర్ట్

గ్రీక్ యోగర్ట్ (Greek Yogurt) తో చేసే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్‌తో పాటు పేగులకు మేలు చేసే ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. దీనిలో బెర్రీలు, అరటిపండు లేదా యాపిల్ ముక్కలు, నానబెట్టిన చియా గింజలు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి.
2. వెజిటబుల్ ఆమ్లెట్

గుడ్లతో తయారుచేసే వెజిటబుల్ ఆమ్లెట్ (Vegetable Omelette) మరో ఉత్తమమైన అల్పాహారం. గుడ్లలోని నాణ్యమైన ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పాలకూర, క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయ వంటి కూరగాయలను కలపడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా లభిస్తాయి. దీనిని గోధుమ బ్రెడ్‌తో కలిపి తీసుకుంటే మరింత సమతుల్యమైన ఆహారంగా మారుతుంది.
3. ఓట్స్ & పనీర్‌తో పోషకాల పవర్

ఓట్స్ (Oats)తో చేసే అల్పాహారం కూడా గట్ హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్‌ను పెరుగు లేదా పాలతో కలిపి, పండ్లు, నట్స్, అవిసె గింజలు జోడించి తీసుకుంటే ప్రోటీన్, ఫైబర్ రెండూ సమృద్ధిగా లభిస్తాయి.
పనీర్ (Paneer) లేదా ఉడికించిన శనగలతో తయారుచేసే శాండ్విచ్ కూడా ఉదయపు అల్పాహారానికి మంచి ఎంపిక. గోధుమ బ్రెడ్‌లో పనీర్, దోసకాయ, టమాటా, పాలకూర వంటి కూరగాయలను జోడించి తయారుచేస్తే పోషకాలతో నిండిన భోజనం సిద్ధమవుతుంది. ఇది ఎక్కువసేపు శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
4.ప్రోటీన్ స్మూతీ పవర్

ఉదయం త్వరగా తయారయ్యే మరో ఆరోగ్యకరమైన ఎంపిక స్మూతీ (Smoothie). పెరుగు లేదా పాలు, అరటిపండు, పాలకూర, పీనట్ బట్టర్, చియా లేదా అవిసె గింజలు కలిపి బ్లెండ్ చేస్తే ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన పానీయం సిద్ధమవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
5.హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. హెల్తీ లైఫ్
ఈ తరహా అల్పాహారాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఒకేసారి అందుతాయి. బరువు నియంత్రణ, మెరుగైన జీర్ణక్రియ, రోజంతా చురుకుదనం వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పటికీ అల్పాహారాన్ని మానేయకుండా, త్వరగా సిద్ధమయ్యే ఈ ఆరోగ్యకరమైన ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లను ఆహారంలో చేర్చుకోవడం మంచి అలవాటుగా మార్చుకోవచ్చు.








