సెప్టెంబర్ లో భూప్రళయం ?
భూమి అంతం గురించి కొన్నేండ్లు చెప్తూ వస్తున్న కుట్ర సిద్ధాంతకర్తలు (కాన్స్పైరసీ థియరిస్ట్స్) ఇప్పుడు ఆ గడియ వచ్చిందని అంటున్నారు. మరో నెలరోజుల్లో భూమి అంతం తప్పదని, నిబిరు అనే అగోచరమైన గ్రహం వచ్చి ఢీకొంటుందని హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్లో భూప్రళయం తప్పదు. ఈ లోగా తీరని కోరికలేవైనా ఉంటే తీర్చుకోండి అని క్రిష్టియన్ న్యూమారాలజిస్ట్గా పేరున్న డేవిడ్ మీడ్ సూచిస్తున్నారు. వచ్చే నెల 20-23 తేదీల మధ్య భూప్రళయం తప్పదని మీడ్ జోస్యం చెప్తున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలో నిబిరు గ్రహం ఢీకొంటుందని, దాంతో భూమి బద్దలై సమస్త జీవాలు అంతరిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. బైబిల్ కడపటిభాగంలోనూ, గిజా పిరమిడ్ లోనూ దీనికి సంబంధించిన సృష్టమైన ఆధారాలున్నాయని మీడ్ తెలిపారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి నిబిరి గ్రహం అకాశంలో ప్రపంచం మొత్తానికి కనిపిస్తుందని, ప్రజలంతా సృష్టంగా దానిని చూడవచ్చని తెలిపారు.








