విటమిన్ చికిత్సతో చర్మ క్యాన్సర్ కు చెక్!
ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ మెలనోమా చికిత్సకు విటమిన్ థెరపీ సమర్థంగా పనిచేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. విటమిన్ బి3 ఉపయోగించి మెలనోమాను అరికట్టవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు కనుగోన్నారు. యూవీ కిరణాల వల్ల చర్మం ఇన్ఫెక్షన్కు గురి కాకుండా, డీఎన్ఏ దెబ్బతినకుండా విటమిన్ బి3లోని నికోటినమైడ్ అడ్డుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్రాము చొప్పున నికోటినమైడ్ను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. యూవీ రేడియోధార్మికత వల్ల చర్మ లోపలి పొరలో ఉండే మెలనోసైట్లోని డీఎన్ఏ దెబ్బతింటుంది. ముఖ్యంగా మెలనోమా క్యాన్సర్ రోగులకు ఈ నికోటినమైడ్ చాలా ఉపయోగకారిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.













