భారత్ కు అందించే అభివృద్ధి నిధుల్లో అమెరికా కోత
భారత్కు సాయంగా అందించే అభివృద్ధి నిధుల్లో భారీ కోత పెట్టాలని అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రతిపాదించింది. 2016లో రూ.550.24 కోట్లు (85 మిలియన్ల డాలర్లు)గా ఉన్న ఈ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరంలో 215.56 కోట్లు (33.3 మిలియన్ల డాలర్లు)కు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలి బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటిని విదేశాంగ శాఖ కాంగ్రెస్ ముందుంచింది. ముఖ్యంగా అంతర్జాతీయ అభివృద్ధికి అమెరికా సంస్థ (యూఎస్ఏఐడీ)కు చెందిన ప్రపంచ ఆరోగ్య పథకం కింద ఇచ్చే నిధుల్లో భారీ కోతకు రంగం సిద్ధం చేసింది. 2016లో రూ.229.80 కోట్లు (35.5 మిలియన్ల డాలర్లు)గా ఉన్నవాటిని రూ.126.88 కోట్లు (19.6 మిలియన్ల డాలర్లు)కు పరిమితం చేయాలని ప్రణాళికలు రచించింది. మరోవైపు అంతర్జాతీయ సైనిక విద్య, శిక్షణ కింద ఇచ్చే మొత్తాన్ని మాత్రం స్వల్పంగా (రూ.7.7 కోట్లు నుంచి రూ.8.4 కోట్లుకు) పెంచాలని ప్రతిపాదించింది. ఉగ్రవాదంపై పోరులో సహకారానికి అందించే నిధుల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు.








