అధ్యక్ష పదవి నుంచి నన్నెవరూ దించలేరు
పదవి నుంచి తనను దింపివేసేందుకు జరుగుత్ను ప్రయత్నాలను తిప్పికొడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. రష్యాతో లింకులకు సంబంధించి తనపై ఎలాంటి దర్యాప్తు జరపకపోవడం, తనకు ఎలాంటి సంబందాలూ లేవనడానికి నిదర్శనమన్నారు. ఇప్పటిదాక తనపై అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీతో తన అంతరంగిక సంభాషణను ఆయనే ఓ మిత్రుడి ద్వారా మీడియాకు లీక్ చేశారని ధ్వజమెత్తారు.
మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మైకేల్ ఫ్లిన్కు రష్యాతో లింకులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేయాలని అధ్యక్షుడు, గత జనవరిలో జరిగిన ప్రైవేటు డిన్నర్ సందర్భంగా కోరారని, ట్రంప్ యంత్రాంగం పలు అసత్యాలు చెప్పిందని, తనను అప్రతిష్ఠ పాల్జేయడానికి ప్రయత్నించిందని సెనేట్ నిఘా కమిటీకి కోమీ ఇచ్చిన లిఖిత పూర్వక వాంగ్యూలంతో అమెరికాలో రాజకీయ తుపాను రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. కోమీ పేరెత్తకుండా శత్రువులపై పోరాడి గెలుస్తామని ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి నన్ను దించివేసేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొడతాను. నాపై ఎన్నెన్ని అబద్ధాలు, ఎన్నో తప్పుడు ప్రకటనలు, ఎలా పోరాడాలో మాకు తెలుసు. ఈ విషయంలో ఎన్నటికీ వెనక్కితగ్గం. శత్రువులు అసత్యాలు చెబుతారు. మనపై ఆసూయాద్వేషాలను ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు ఏ మార్పు కోసమైతే మనకు ఓటేశారో కచ్చితంగా ఆ మార్పును వారు చూస్తారు అని తన మద్దతుదారులను ఉద్దేశించి సృష్టం చేశారు.













