‘హెచ్–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి
హెచ్ 1బీ వీసా గల విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని ప్రస్తుత 60వేల డాలర్ల నుంచి కనీసం 80వేల డాలర్లకు పెంచాల్సిన అవసరముందని అమెరికా కార్మికమంత్రి అలెగ్జాండర్ అకోస్టా అభిప్రాయపడ్డారు. ఇది అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను తీసుకోవటానికి సంబంధించిన సమస్యను చాలావరకు పరిష్కరించగలదని సెనేట్ కమిటీకి తెలిపారు. కనీస వేతన పరిమితిని చాలాకాలంగా సవరించలేదని, దీన్ని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించి ఉంటే ఇట్టే 80 వేల డాలర్లకు పైగా అయ్యిండేదని వివరించారు. 60 వేల డాలర్ల కనీస వేతన పరిమితిని నిర్ణయించిన సమయంలో అది సముచితమే అయ్యిండొచ్చు గానీ ఇప్పుడు దీన్ని పెంచే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.













