అమెరికాలో నాణ్యమైన విద్య – కాథెరిన్ హడ్డా
అమెరికాలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు 4500 వరకు ఉన్నాయని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయ కాన్సుల్ జనరల్ కాథెరినే హడ్డా తెలిపారు. విశాఖలోని ప్లాటినం జూబ్లీ అతిథిగృహంలో ఈటీవీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా అమెరికాలో విద్యావకాశాలు అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా బోధన, ప్రతిభావంతులైన ఆచార్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సమాచారాన్ని ఫేస్బుక్లో ఉంచామన్నారు. అమెరికాలో హేట్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతాయని, భద్రత తక్కువగా ఉంటుందని పలువురు అపోహపడుతున్నారని, అది వాస్తవం కాదన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారికి ఎన్నో రకాల సందేహాలుంటాయని, వాటిని నివృత్తి చేయడానికి కాన్సల్ జనరల్ కార్యాలయ అధికారులే విశాఖ రావడం శుభపరిణామమన్నారు.













